
పత్రికా స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం..
కొత్తగూడెంఅర్బన్: పత్రికా స్వేచ్ఛను హరిస్తే ఊరుకోబోమని పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ రాజకీయ ఒత్తిళ్లతో విజయవాడలోని సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు, అన్ని జర్నలిస్ట్ యూనియన్లు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. పోస్టాఫీస్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద, బస్టాండ్ సెంటర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. పోస్టాఫీస్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండా సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తోందని, ఇటువంటి చర్యలను అన్ని వర్గాలు ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే పత్రికలను ఎవరూ అడ్డుకోలేరని, అడ్డుకున్న వారంతా చరిత్రలో లేకుండా పోయారని గుర్తుచేశారు. పోలీసులతో సోదాలు చేయించి భయపెట్టాలని చూస్తే అవివేకమే అవుతుందన్నారు. నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షి దినపత్రిక స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల స్టాఫర్లు తాండ్ర కృష్ణ గోవింద్, రాజేందర్, లక్ష్మణ్, డి.వెంకటేశ్వర్లు, షఫీ, అశోక్, కురుమిళ్ళ శంకర్, ఉదయ్, శ్రీనివాస్, ఈశ్వర్, జర్నలిస్టు సంఘాల నాయకులు ఇమంది ఉదయ్ కుమార్, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు యెర్రా కామేష్, గౌని నాగేశ్వరరావు, అంతోటి నాగేశ్వరరావు, కోటా శివశంకర్, వాసం రామకృష్ణ దొర, జర్నలిస్టులు జునుమల రమేష్, వాసాల శేఖర్, కృష్ణారావు, పి.రాము, అంతడుపుల శేఖర్, సాయి, తారక్, వీరు, ప్రవీణ్, రేశ్వంత్, రవి, అఫ్జల్, సుధాకర్, రాజ్ కుమార్, సూరి, మురళి, బుపేష్, సతీష్, శంకర్, రవీందర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
అది ప్రజాస్వామ్యంపై దాడే..
ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో జరిగిన సోదాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జైభీమ్ రావ్ భారత్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ తెలిపారు. జర్నలిస్టులు సామాజిక మార్పునకు మార్గదర్శకులని, చీకటిలో వెలుగులూదే దీపస్తంభాలని, ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధులని, అలాంటి జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేయడం సరికాదని అన్నారు.
ఇది ప్రజాస్వామ్య భవితవ్యంపై దాడి అని, ఇలాంటి వాటిని దేశంలోని విలువలపై దాడిగా భావించాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఖరులపై ప్రశ్నలు వేయడం జర్నలిస్టుల బాధ్యత అని అన్నారు. ధైర్యంగా నిజాన్ని వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులను భయపెట్టే ప్రయత్నాలు ఎప్పుడూ విఫలమవుతాయని అన్నారు. జేబీపీ తరఫున జర్నలిస్టుల న్యాయ పోరాటానికి తాము అండగా ఉంటామని, స్వేచ్ఛ కోసం పోరాడే ప్రతి పత్రికా ఉద్యోగికి సంఘీభావం ఉంటుందని పేర్కొన్నారు.
జర్నలిస్టులు, ప్రజాసంఘాలు,
రాజకీయ నాయకుల హెచ్చరిక
సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసులతో సోదాలు సరికాదు
ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టిన పాత్రికేయులు
జిల్లా కేంద్రంలో ప్లకార్డులతో నిరసన, ప్రదర్శన