
అంగన్‌వాడీలు సతమతం!
● జిల్లాలో 191 టీచర్, 960 హెల్పర్ పోస్టులు ఖాళీ ● ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్న ఐసీడీఎస్ శాఖ ● టీచర్లు, ఆయాలపై పెరుగుతున్న పనిభారం
భద్రాచలంఅర్బన్: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో టీచర్లు, హెల్పర్లపై పనిభారం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 2,060 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 191 టీచర్, 960 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నేళ్లుగా టీచర్లు, హెల్పర్లు లేని కేంద్రాలను ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. దీంతో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సకాలంలో పౌష్టికాహారం అందడంలేదు. గర్భిణులు, బాలింతలకు టీచర్లు సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేకపోతున్నారు.
టీచర్లు, హెల్పర్లపై అదనపు భారం
అంగన్‌వాడీ సెంటర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తాయి. లబ్ధిదారులకు అందించే సరుకులు, గృహ సందర్శన వివరాలు నమోదు చేసేందుకు రిజిస్టర్లు ఉపయోగిస్తున్నారు. గత ప్రభుత్వం టీచర్లకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చింది. వీటిల్లో సుమారు 10 వరకు యాప్‌లు పొందుపరిచారు. వివరాలను రిజిస్టర్లు, యాప్‌లలో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. టీచర్లు, హెల్పర్లు అంగన్‌వాడీ కేంద్రంలో విధులతోపాటు వైద్యారోగ్యశాఖ కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. బూత్ లెవల్ అధికారులుగా ఎన్నికల విధులు కూడా నిర్వర్తించాలి. దీంతో పనిభారం తట్టుకోలేక సతమతమవుతున్నారు. కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లాక కూడా పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కొన్ని స్మార్ట్‌ఫోన్లు కూడా పనిచేయడంలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర కేంద్రాలకు ఇన్‌చార్జిలుగా నియమించడంతో ఏ కేంద్రానికీ న్యాయం చేయలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఖాళీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీంతో నిరుద్యోగులైన మహిళా అభ్యర్థులు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అని ఎదురు చూస్తున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే లబ్ధిదారులకు మెరుగైన సేవలందే అవకాశం ఉంది.
ఉన్నతాధికారులకు నివేదించాం
పోస్టులు ఖాళీలున్న కేంద్రాల్లో ఇన్‌చార్జ్‌లను నియమించాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇక ఖాళీల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
–స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి

అంగన్‌వాడీలు సతమతం!