
ధాన్యం 42 కేజీల తూకం పెడితే చర్యలు
● అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ● సోములగూడెం కొనుగోలు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం
పాల్వంచరూరల్: నిబంధనల మేరకు 40 కేజీలు మాత్రమే తూకం వేయాలని, ధాన్యాన్ని 42 కేజీల తూకం వేస్తే చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ హెచ్చరించారు. ‘తరుగు..తంటాలు ’శీర్షికతో శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా అదనపు కలెక్టర్ స్పందించారు. మండల పరిధిలోని సోములగూడెం గ్రామశివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం నిల్వలను పరిశీలించారు. ధాన్యం అధిక తూకంపై రైతులను ఆరా తీశారు. ఆ సమయంలో కేంద్రం నిర్వాహకులు కాంటా వేయడం నిలిపివేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 కేజీల అదనపు తూకంవేస్తే సస్పెండ్ చేస్తామని సంబంధిత సిబ్బందిని హెచ్చరించారు. లిఖిత పూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.
మొలకెత్తిన ధాన్యం చూపిన రైతులు
కొనుగోలు కేంద్రంలో నిల్వచేసిన ధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి మొలకలు వచ్చాయని బాధిత రైతులు శేఖర్, బాబారావు తదితరులు అదనపు కలెక్టర్‌కు చూపించి ఆవేదన చెందారు. కొనుగోళ్లలో జాప్యంతోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, విద్యుత్ సరఫరాకు సరైన చర్యలు తీసుకోవాలని, మరో ప్యాడీ క్లీనర్ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. అదనపు కలెక్టర్ వెంట డీటీ శ్రీనివాసరావు, సొసైటీ కార్యదర్శి శ్రీను ఉన్నారు.

ధాన్యం 42 కేజీల తూకం పెడితే చర్యలు