
రమణీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
భద్రాచలం: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం భద్రాచలం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంగళవారం అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 9.20 గంటలకు వాజేడు మండలం టేకులగూడెం, నగరం, ఎడ్జర్లపల్లి, అనంతరం 11.20 గంటల నుంచి వెంకటాపురం మండల కేంద్రం, పాత్రపురం, పాలెంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి చర్ల మండలంలోని సుబ్బంపేట, లక్ష్మీ కాలనీ, తేగడ గ్రామాల్లో, 3.45 గంటలకు దుమ్ముగూడెం మండలం చిన్న బండిరేవు, సింగవరం, సాయంత్రం 4.45 గంటలకు భద్రాచలం మండలంలో పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
నిర్ణయించిన ఫీజులే
వసూలు చేయాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ల్యాబ్‌లు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రజలకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ఫీజులు నిర్ణయించామని, ఆయా యాజమాన్యాలు ఆ మేరకే వసూలు చేయాలని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ కార్యాలయంలో సంప్రదించాలని ప్రజలను కోరారు.
పట్టెడు కోయ సంస్కృతి పుస్తకావిష్కరణ
కరకగూడెం: మండలంలోని వీరాపురానికి చెందిన ఆదివాసీ మహిళ కుంజా వరలక్ష్మి రూపొందించిన పట్టెడు కోయ సంస్కృతి పుస్తకాన్ని హైదరాబాద్‌లో మంత్రి సీతక్క మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీ తెగల చరిత్ర మరుగునపడుతున్న సమయంలో, వారి సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా నిలిపేందుకు ఈ పుస్తకం దోహదం చేస్తుందని చెప్పారు. పూర్వ కోయ తెగల చరిత్రను జానపద సాహిత్య రూపంలో సమాజానికి పరిచయం చేసిన వరలక్ష్మిని అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ భట్టు రమేష్, నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ఆప్కా నాగేశ్వరరావు, రచయిత శోభ రమేష్‌తో పాటు గట్టుపల్లి రాంబాబు, వజ్జా నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.
21 మంది ఈఅండ్‌ఎం అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న 21 మంది ఈఅండ్‌ఎం అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో ఒక అడిషినల్ జీఎం, ఏడుగురు డీజీఎంలు, 9 మంది ఎస్‌ఈలు, ఇద్దరు డిప్యూటీ ఎస్‌ఈలు, ఇద్దరు ఈఈలు ఉన్నారు. వీరంతా ఈ నెల 15వ తేదీ లోగా కేటాయించిన ఏరియాల్లో విదుల్లో చేరాలని యాజమాన్యం ఆదేశించింది.

రమణీయం.. రామయ్య కల్యాణం

రమణీయం.. రామయ్య కల్యాణం