
చికిత్స పొందుతూ మహిళ మృతి
జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ బాదావత్ రవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బేతాళపాడు గ్రామ పంచాయతీ పీక్లాతండాకు చెందిన గుగులోత్ బుల్లి(58), ఆమె సోదరుడు బానోత్ కసనతో కలిసి శనివారం బైక్‌పై పని నిమిత్తం పడమటనర్సాపురం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో మార్గమధ్యలో రేగళ్లతండా గ్రామ శివారులోని కోళ్ల ఫారమ్ వద్దకు రాగానే వెనుక నుంచి కారు ఆ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి మృతి చెందింది. మృతురాలి కుమారుడు అప్పునాయక్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ బానోత్ రవిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పురుగుల మందు తాగిన వ్యక్తి..
ములకలపల్లి: పురుగుమందు తాగి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సత్యంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన సవలం శివ(32) భార్య నాగమణితో కలసి జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమాన మద్యానికి బానిసైన ఆయన గురువారం గ్రామశివారులోని మామిడితోటలో పురుగుల మందు సేవించాడు. గమనించిన సమీపస్తులు హుటాహుటిన పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్సలు అందించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ పుల్లారావు తెలిపారు.