
అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
టూర్ షెడ్యూల్‌లో లేకుండా, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బీటీ రోడ్డు శంకుస్థాపనకు శిలాఫలకం ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆర్‌అండ్‌బీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పర్యటన సందర్భంగా ఆర్లపెంట క్రాస్‌రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన శిలాఫలకం వద్ద కాన్వాయ్‌ని ఆపి, కొబ్బరికాయ కొట్టి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయాలని ఎమ్మెల్యేను మంత్రి తుమ్మల కోరారు. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే.. తన నియోజకవర్గ పరిధిలోని బీటీ రోడ్డు శంకుస్థాపనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, టూర్ షెడ్యూల్‌లో కూడా లేకుండా ఎలా ఏర్పాటు చేశారంటూ ఆర్‌అండ్‌బీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం మంజూరైన రోడ్డుకు ఇప్పుడు శంకుస్థాపన ఏంటని ప్రశ్నించారు. దీంతో తుమ్మల.. ఎమ్మెల్యేను సముదాయిస్తూ కొబ్బరికాయ కొట్టాలని కోరగా ‘మీరంటే గౌరవం ఉంది కానీ, అధికారులు ముందుగా చెప్పకుండా ఏర్పాటు చేసిన శంకుస్థాపన చేయలేను’ అంటూ తెగేసి చెప్పారు. తన మనోభావం దెబ్బతిందని, వంతెనల ప్రారంభోత్సవానికి కూడా రానంటూ వెళ్లిపోతుండగా తుమ్మల ఎమ్మెల్యే చెయ్యి పట్టుకుని తన కారులో ఎక్కించుకున్నారు. జారే అనుచరుడు చిన్నశెట్టి యుగంధర్ మంత్రి కారు ఎక్కొద్దంటూ వారించడమే కాక కారును అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో తుమ్మల వారిని సముదాయించి తర్వాత మాట్లాడుకుందాం అంటూ తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యేను తన కారులోనే ఎక్కించుకున్న తుమ్మల బీటీ రోడ్డు శిలాఫలకం వద్ద ఆపి, ప్రారంభోత్సవం చేయాలని కోరారు. దీంతో యుగంధర్ ఎమ్మెల్యేను వారించగా సముదాయించిన తుమ్మల మొదట అతడితోనే కొబ్బరికాయ కొట్టించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా టెంకాయ కొట్టి మంత్రితో పాటు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.