
కార్పొరేషన్ సరే.. సమస్యల సంగతేంటీ..?
● మున్సిపల్ కార్పొరేషన్‌తో పెరిగిన కొత్తగూడెం హోదా ● త్వరలో జీఓ విడుదలయ్యే అవకాశం ● గూడెం, పాల్వంచ పట్టణాలను వేధిస్తున్న సమస్యలు ● అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవ అవసరం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌ను స్వాగతిస్తున్న ప్రజలు అక్కడి సమస్యల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోక అవస్థ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం నోటిఫైడ్ ఏరియా నుంచి క్రమంగా కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతోపాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను విలీనం చేస్తూ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. రేపోమాపో జీవో విడుదల అయితే పూర్తిస్థాయిలో కార్పొరేషన్‌గా మారనుంది. 1971లో నోటిఫైడ్ ఏరియాగా పాలన ప్రారంభమైంది. 1995లో ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అనంతరం 2000 సంవత్సరంలో 79,721 మంది జనాభా కలిగి ఉండగా, 33 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు నాలుగుసార్లు కౌన్సిల్ ఎన్నికలు జరగ్గా, నాలుగుసార్లూ మహిళలే మున్సిపల్ చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం గెజిట్ విడుదల కాగా, జీఓ విడుదలయ్యాక పూర్తిగా కార్పొరేషన్‌గా మారనుంది. అనంతరం స్పెషల్ ఆఫీసర్ నియామకం, డివిజన్ల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు.
రెండు పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలు
కార్పొరేషన్‌లో భాగంగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ప్రజలను సమస్యలు వేధిస్తున్నాయి. సమస్యల పరిష్కారంపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 20 ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు చెక్కు చెదరకుండా ఉంటే, రెండు, మూడేళ్ల క్రితం నిర్మించిన రోడ్లకు పగుళ్లు వస్తున్నాయి. పెచ్చులు ఊడిపోతున్నాయి. అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కిన్నెరసాని ప్రధాన పైపులైన్ పగలడం, లీకవడంతో కొత్తగూడెం ప్రజలకు తరచూ తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. పట్టణంలో పార్కింగ్ జోన్ లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై వాహనాలు నిలిపితే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. పట్టణంలో చెప్పుకోదగిన పార్కులు లేవు. ఉన్న పార్కులు సౌకర్యాలు లేకపోవడంతో వృథాగా మారుతున్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పార్కు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. దీంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం కరువైంది. రామవరంలోని ఏడు వార్డులకు దశాబ్దాలుగా క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వడం లేదు. ఇక రోడ్ల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. పాల్వంచ మున్సిపాలిటీలో దశాబ్దాలుగా ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది.
తొలుత పన్నులు పెరుగుతాయి..
కొత్తగూడెం కార్పొరేషన్‌తో ఇక్కడి ప్రజల 20 ఏళ్ల కల నెరవేరింది. అదే తరుణంలో కార్పొరేషన్‌లో ఇంటి పన్నులు, పంపు బిల్లులతో పాటు భూమి ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పడున్న ఆస్తి విలువ రెట్టింపయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్‌లో అధికారులు, సిబ్బంది సంఖ్య పెరగనుండగా, ముఖ్యంగా ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉంటారు. గతంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాలకు కలెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకునేవారు. కానీ కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉండనుండటంతో పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉండదని భావిస్తున్నారు. కార్పొరేషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రావడంతోపాటు స్థానికంగా వివిధ రకాల పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కార్పొరేషన్ కాగానే తొలుత ప్రజలే పెరిగిన ఇంటి పన్నులు, పంపు బిల్లులు చెల్లించాలి. ఆ తర్వాత కార్పొరేషన్‌కు అభివృద్ధి నిధులు వస్తాయో, రావోననే అభిప్రాయం కూడా స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. దీంతోపాటు జిల్లాలో 1/70 యాక్టు ఉండటంతో అభివృద్ధి పూర్తిస్థాయిలో జరిగేందుకు వీలు ఉండదని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా కార్పొరేషన్ ఏర్పాటుపై తొలుత సుజాతనగర్‌లోని ఏడు పంచాయతీల ప్రజలు నిరసన తెలిపారు.