
టపాసుల షాపుల వద్ద ఫైరింజనేది?
కొత్తగూడెంటౌన్: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల వద్ద వ్యాపారులు నిబంధనలు పాటించడంలేదు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో 40 , రామవరంలో 6, రుద్రంపూర్‌లో 2 షాపులకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ప్రకాశం స్టేడియంలో 40 షాపులు ఏర్పాటు చేసినా అగ్నిమాపక ఫైరింజిన్ అందుబాటులో ఉంచలేదు. దుకాణాల ముందు డ్రమ్ములు ఏర్పాటు చేసినా వాటిలో నీళ్లు కూడా నింపలేదు. మున్సిపల్ ట్యాంకర్ మాత్రం ఒకటి అందుబాటులో ఉంచారు. మట్టి బకెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. షాపుల ఏర్పాటు, రక్షణ చర్యలను అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కమీషన్‌లు ఇచ్చి అనుమతులు తెచ్చుకున్నామని, నిబంధనలు పాటించకపోయినా అధికారులు ప్రశ్నించరనే ధీమాతో వ్యాపారులు ఉన్నట్లు పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. యజమానులు టపాసుల అమ్మకాలపై ఉంచిన శ్రద్ధను, అవి కొనేందుకు వచ్చే ప్రజలకు హాని జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చూపడం లేదని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి షాపుల వద్ద ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలని, నిబంధనలను పాటించని వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిబంధనలు పాటించని వ్యాపారులు