
శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలి
పాల్వంచ: ఖమ్మంలో డిసెంబర్ 26న జరిగే సీపీఐ జాతీయ శతాబ్ది ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.సారయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఐదు లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు జాతా ఏర్పాటు చేశామని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీస్తూ, రాజకీయ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం నరహత్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమై పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా మాట్లాడుతూ శత వసంతాల ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, మిర్యాల రంగయ్య, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, నరాటి ప్రసాద్, వై.ఉదయ్ భాస్కర్, ఎస్‌డి.సలీం, సలిగంటి శ్రీనివాస్, రావులపల్లి రవికుమార్, చంద్ర నరేంద్రకుమార్, వీరస్వామి, వెంకటేశ్వరరావు, ఎల్లయ్య, శంకర్, మురళి, సమలయ్య, దస్రు, నాగయ్య, రాహుల్, ఫహీం తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు