
అర్ధరాత్రి ఏసీబీ సోదాలు
● అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుల్లో తనిఖీలు ● లెక్కకు మించి ఉన్న నగదు స్వాధీనం ● రికార్డులను వెంట తీసుకెళ్లిన అధికారులు
పాల్వంచరూరల్/అశ్వారావుపేట/పెనుబల్లి: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఉమ్మడి జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో సోదాలు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆర్టీఏ చెక్ పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలోని సోదాలు జరిపారు. పాల్వంచ మండలం జగన్నాథపురం, నాగారం కాలనీ గ్రామాల మధ్య బీసీఎం జాతీయ రహదారిపై ఉన్న చెక్‌పోస్టులో దాడులు నిర్వహించారు. కంప్యూటర్ డేటా, రికార్డులతోపాటు చెక్‌పోస్టులోఉన్న అధికారి, సిబ్బంది సెల్‌ఫోన్లను కూడా తనిఖీ చేశారు. ఓవర్‌లోడ్ ఫైన్, ట్యాక్స్ కలెక్షన్ వంటి విషయాల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలపై తనిఖీలు నిర్వహించి నట్లు డీఎస్పీ తెలిపారు. లెక్కలో లేని రూ.26 వేల నగదు లభించిందని పేర్కొన్నారు. దొరికిన నగదు వ్యవహారంపై ఎంవీఐ, సిబ్బందిపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు సమాచారం. కాగా ఇదే చెక్ పోస్టులో గతేడాది ఆగస్టులో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అశ్వారావుపేట ఆర్టీఏ చెక్‌పోస్టులో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధి లోని ముత్తగూడెం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. సీజ్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. రికార్డుల ప్రకారం ఉండాల్సిన సొమ్ము కంటే అదనంగా రూ.6,660 ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు.