
వైభవంగా రుద్రహోమం
పాల్వంచరూరల్: మాసశివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమం పూజలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో ఆదివారం అమ్మవారి సన్నిధికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. యా గశాలలో రుద్రహోమం పూజలు జరిపారు. ముందుగా మేళతాళాలతో, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన,గణపతి పూజ రుద్రహోమం చేశారు. చివరన పూర్ణాహు తి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రవికుమార్‌శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.
దీపావళి
వెలుగులు నింపాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కొత్తగూడెంఅర్బన్: ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ కోటి కాంతులు నింపాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు బాణసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే టపాసులు ఉపయోగించకుండా హరితదీపావళి జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
నేటి గిరిజన దర్బార్ రద్దు
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవా రం జరిగే గిరిజన దర్బార్‌ను రద్దు చేస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బిరాహుల్ ఆదివా రం ప్రకటనలో తెలిపారు. సోమవారం దీపావళి పండుగ కావడంతో దర్బార్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, ఐటడీఏ అధికారులు, సిబ్బందికి పీఓ దీపావళి శుభా కాంక్షలను తెలిపారు.
రేగులతండా వాసికి జాతీయస్థాయి ర్యాంకు
టేకులపల్లి: ఎయిమ్స్‌లో ఉద్యోగ నియామకాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన పరీక్షలో టేకులపల్లి మండలం రేగులతండాకు చెందిన మహిళ అజ్మీర చంద్ర మూడో ర్యాంకు సాధించింది. సుజాతనగర్ మండలం సర్వారం పంచాయతీకి చెందిన అజ్మీర చందు, సాజి దంపతుల కుమార్తె చంద్ర పీజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసింది. 2019లో టేకులపల్లి మండలం రేగులతండాకు చెందిన ఇస్లావత్ నరేందర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. వివాహ అనంతరం భర్త ప్రోత్సాహంతో పీజీ డిప్లొమా పూర్తి చేసింది. నాలుగేళ్లుగా హైదరాబాద్ నిమ్స్‌లో ఈసీజీ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన పరీక్షకు హాజరై ప్రతిభ చూపింది. ముంబైలోని అంధేరి ఈఎస్‌ఐసీ మోడల్ ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని కై వసం చేసుకుంది.
కిన్నెరసానిలో
బోటు షికారు
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి వాతావరణం కన్పించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 498 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖ కు రూ.28,355 ఆదాయం వచ్చింది. 290 మంది బోటుషికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.17,360 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

వైభవంగా రుద్రహోమం