
ఎంసీహెచ్ కిట్.. కట్..
పేరు మార్చారు.. సరఫరా మరిచారు..
● జిల్లాలో ఏడాదికి 15 నుంచి 20 వేల వరకు ప్రసవాలు ● ప్రారంభంలో వెయ్యి కిట్లు పంపిణీ.. ● తర్వాత చేతులెత్తేసిన ప్రభుత్వం
ఇల్లెందు: గర్భిణులు, బాలింతలకు అందించే పథకాల పేర్లను ప్రస్తుత ప్రభుత్వం మార్చింది. కానీ, ఆ కిట్లను సరఫరా చేయడం లేదు. నాటి ప్రభుత్వంలో కేసీఆర్ కిట్‌గా చెలామణిలో ఉన్న పథకానికి ఎంసీహెచ్ కిట్‌గా పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సరఫరా చేయడం మానేసింది. 10 నెలలుగా గర్భిణులు, బాలింతలకు అందజేసే ఏ కిట్టు కూడా అందటం లేదు. ఎంసీహెచ్ కిట్‌తో పాటు న్యూట్రీషియన్ కిట్, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు, ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేలు నగదు ప్రోత్సాహం కూడా అందటం లేదు. ప్రస్తుతం కిట్ల కోసం గర్భిణులు, బాలింతలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2024–25 సంవత్సరానికి గాను సుమారు 13,500 వరకు ప్రసవాలు జరిగాయి. అందులో ఒక్కరికి కూడా కిట్ అందలేదు. జిల్లాలో 29 పీహెచ్‌సీలు, 10 యూపీహెచ్‌సీలు, 376 సబ్ సెంటర్లు, 7 ఏరియా వైద్యశాలలు ఉన్నాయి. ఒక్క ఇల్లెందు ఏరియా వైద్యశాలలోనే 1,949 ప్రసవాలు జరగగా 1,624 మందికి ఎంసీహెచ్ కిట్లు అందజేశారు. ఇంకా 324 మందికి అందలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి అందడంలేదు.
ప్రసవాల సంఖ్య పెరిగేదెలా..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో ఈ పథకాలను ప్రవేశపెట్టారు. ఎంసీహెచ్ కిట్, న్యూట్రీషియన్ కిట్లతో పాటు నగదు ప్రోత్సాహం కూడా ప్రస్తుతం అందటం లేదు. ప్రభుత్వం నుంచి ఈ పథకాల పంపణీ ఊసే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ కిట్‌ను తొలిగించి గర్భిణుల కోసం మదర్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) కిట్‌ను ప్రవేశపెట్టారు. ఏరియా వైద్యశాలల్లోనే ఏడాదికి 15 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఎంసీహెచ్ కిట్‌గా పేరు మార్చిన తర్వాత జిల్లాలో వెయ్యి కిట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఆ తర్వాత సరఫరా ఆగిపోయింది. రూ.12 వేలు, రూ.13 వేల పారితోషికం కూడా రావడం లేదు. గర్భిణులకు 5వ నెల నుంచి 8వ నెల వరకు ఏడాడిలో రెండు సార్లు ఇచ్చే న్యూట్రీషియన్ కిట్‌లు కూడా ఇవ్వడం లేదు. మూడు దశల్లో రూ.12 వేలు అందజేయటం, అమ్మాయి అయితే మరో వెయ్యి అదనంగా అందించే నగదు ప్రోత్సాహానికీ చెక్ పడింది. తొలి విడత రూ.3 వేలు, రెండో విడత రూ.4 వేలు, తర్వాత రూ.5 వేలు అందిస్తే అవి పేదలకు ఎంతగానో ఉపయోగపడేవి. ఎంసీహెచ్ కిట్‌లో తల్లీ, బిడ్డకు కావాల్సిన దుస్తులు, సబ్బులు, నూనెలు, పౌడర్లు, ఈగలు, దోమలు వాలకుండా తెర, టవళ్లు లాంటి వస్తువులు ఉండేవి.
న్యూట్రీషియన్ కిట్ అందలేదు..
గర్భిణులకు ఇచ్చే న్యూట్రీషియన్ కిట్ అందలేదు. ప్రసూతి సమయంలో అందజేసే కిట్ కూడా ఇవ్వలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న వస్తువులను వాడుకున్నాం. గతంలో ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం అయితే అందజేసే కిట్‌ను ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే.. ప్రభుత్వం నుంచి రాలేదంటున్నారు. –స్రవంతి, బాలింత, లక్ష్మీపురం, ఆళ్లపల్లి
ప్రభుత్వం నుంచి సరఫరా లేదు
ప్రభుత్వం నుంచి సరఫరా నిలిచిపోయింది. గతంలో కేసీఆర్ కిట్, న్యూట్రీషియన్ కిట్ ఉండగా ప్రస్తుతం ఎంసీహెచ్ కిట్‌గా మార్చారు. ఏటా ఏరియా ఆస్పత్రుల్లో 15 నుంచి 20 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. అందరికీ ఈ కిట్‌లు, నగదు ప్రోత్సాహం అందటం లేదు.
– డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్‌ఎస్

ఎంసీహెచ్ కిట్.. కట్..

ఎంసీహెచ్ కిట్.. కట్..