
వర్గీకరణతోనే ఆదివాసీలకు న్యాయం
ఇల్లెందు: ఎస్టీ వర్గీకరణతోనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ సంఘాల జేఏసీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే చందాలింగయ్య దొర అన్నారు. గురువారం ఇల్లెందులోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఎస్టీ వర్గీకరణ కోసం కమిషన్ నియమించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చిందని, అంబేద్కర్ జయంతి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ చట్టం చేసి జీఓ విడుదల చేసినందున ఎస్టీల్లో వర్గీకరణ ఆశలు రేకెత్తాయన్నారు. ప్రభుత్వం ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే అందులో 600 పోస్టులు ఎస్టీలకు వచ్చాయని, వాటిలో ఆదివాసీలకు 93 ఉద్యోగాలే వచ్చాయని పేర్కొన్నారు. మిగిలిన 507 పోస్టులను లంబాడీలు, ఇతర ఎస్టీలు పొందారని పేర్కొన్నారు. ఈ తరుణంలో ఆదివాసీలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఇతర సోదర ఆదివాసీ సంఘాల వారు పోరాటం కంటే ఇతరుల మీద ద్రుష్పచారం చేసేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని పేర్కొన్నారు. వారు తమ వైఖరి మార్చుకుని ఎస్టీ వర్గీకరణ పోరాటంలో కలిసి రావాలని కోరారు. తొలుత ఫారెస్టు గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సభలో తుడుందెబ్బ కళాకారులు గీతాలు ఆలపించారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, నాయకులు వట్టం నారాయణ, పొడుగు శ్రీనాథ్, యాసం రాజు, రేగ నరేందర్‌కుమార్, కబ్బాక శ్రావణ్‌కుమార్, మైపతి వీణారాణి, కోరం శేషయ్య, గంట సత్యం, గుంపిడి వెంకటేశ్వర్లు, బూర్క యాదగిరి, వట్టం కన్నయ్య పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర