
పత్తి రైతుపై విత్తన పోటు..
● ఈ ఏడాది ఒక్కో ప్యాకెట్‌పై రూ. 37 పెంపు ● ఆరేళ్లుగా ఏటా పెరుగుతున్న విత్తన ధరలు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న దూది రైతులు
బూర్గంపాడు: పత్తి రైతుపై ఈ ఏడాది కూడా విత్తన భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పత్తి విత్తనాల ధరలను పెంచుతూ విత్తన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 475 గ్రాముల ప్యాకెట్‌పై ధర రూ.37 పెంచాయి. దీంతో ప్యాకెట్ రేటు రూ.901కు చేరింది. ఆరేళ్లుగా పత్తి విత్తనాల ధరలు ఏటా పెరుగుతున్నాయి. ఈసారి పెరిగిన ధరలతో జిల్లాలోని రైతులపై రూ.2.05 కోట్ల అదనపు భారం పడనుంది.
2.20 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో సుమారు 2.20 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంటగా పత్తికి మొదటిస్థానం దక్కింది. ఎకరం సాగుకు 2 నుంచి 3 ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయి. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుండగా, చాలామంది రైతులు ఆ పద్ధతిలోనే పత్తిసాగుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఎకరాకు 3 నుంచి 4 విత్తన ప్యాకెట్లు అవసరమవుతున్నాయి. విత్తనాలు వేశాక వర్షాలు సరిగా కురకవపోతే మళ్లీ తిరిగి విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో సుమారు 5 లక్షల విత్తనాల ప్యాకెట్లు ప్రతి ఏటా అవసరముంటున్నాయి. వివిధ కంపెనీల పత్తి విత్తనాలను ఆయా డీలర్ల వద్ద కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. ఒక్కోసారి కొన్ని కంపెనీల విత్తనాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి రెట్టింపు ధరలకు కూడా కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు రైతులపై మరింత భారం మోపుతున్నాయి.
ఐదేళ్లలో రూ.171 పెంపు
గడిచిన కొన్నేళ్లుగా పత్తి విత్తనాల ధరలు పెరుగుతున్నాయి. 2020–21లో ప్యాకెట్ ధర రూ.730 ఉండేది. 2021–22కు రూ.767కు చేరింది. 2022–23లో అది రూ.810కి పెరిగింది. 2023–24లో రూ.853కు, 2024–25లో రూ.864కు చేరింది. ఈ ఏడాది 2025–26లో ప్యాకెట్ ధర.901కు పెరిగింది. ఐదేళ్ల వ్యవధిలో పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.171 మేర పెరిగింది. విత్తన ధరలతోపాటు ఎరువులు, పురుగుమందులు, కూలీల రేట్లు ఏటా పెరుగుతుండటంతో పత్తి రైతులపై పెట్టుబడి భారం పెరుగుతోంది. పెరుగుతున్న పెట్టుబడి అనుగుణంగా పత్తి ధరలు పెరగకపోవటం రైతులకు నష్టం కలిగిస్తోంది. గత రెండేళ్లుగా బహిరంగ మార్కెట్‌లో పత్తికి మద్దతు ధర దక్కలేదు. దీంతో సీసీఐ రంగంలోకి రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేయాల్సి వచ్చింది.
రైతుల ఆగ్రహం
పత్తి విత్తనాల ధరల పెంపుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా ప్రభుత్వం విత్తనాల ధరలను పెంచేందుకు అనుమతినివ్వటం తమపై భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు రాయితీలు ఇవ్వకుండా.. ప్రభుత్వాలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలను పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వటం సరికాదని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
గత ఆరేళ్లలో విత్తన ధరలు పెరిగిన తీరు(రూ.లలో)
ఏడాది ధర పెరిగినది
2020-21 730 ---
2021-22 767 37
2022-23 810 43
2023-24 853 43
2024-25 864 11
2025-26 901 37

పత్తి రైతుపై విత్తన పోటు..