
వర్షాలు.. సస్యరక్షణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో రైతులు రసాయన (ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు) ఎరువులను వాడొద్దని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ తెలిపారు. వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
వరి
●నీటి ముంపుకు గురైన నారుమడులు, వరి పొలాల నుంచి నీటిని వెంటనే తొలగించాలి
●మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున పొలంలో నీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి
●రైతులు వరి నాట్లను రెండు రోజులు వాయిదా వేసుకోవాలి
●ఇప్పటివరకు నారు పోయని రైతులు వర్షాలు తగ్గాక పొలాలను దమ్ము చేసుకుని నేరుగా విత్తే పద్ధతిలో స్వల్ప కాలిక (120–124 రోజుల) వరి రకాలను సాగు చేసుకోవచ్చు.
మొక్కజొన్న
●మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదు. పొలం నుంచి నీటిని తక్షణమే తీసివేయాలి
●అధిక వర్షాలతో నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదారంగులోకి మారే అవకాశం ఉంది. వర్షాలు తగ్గాక 5 గ్రా. 19:19:19 లేదా 20 గ్రాములు డీఏపీ మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి
పత్తి
●వర్ష సూచన ఉన్నందున పత్తి చేలో నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి
●ముంపునకు గురైన పత్తి పంటలో వడలు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. మురుగు నీటిని పొలం నుంచి తీసివేసి పంట త్వరగా కోలుకోకునేందుకు వర్షాలు తగ్గిన తర్వాత 10 గ్రా. పాలీఫీడ్ (19:19:19) లేదా మల్టీ–కె (13–0–45) లేదా యూరియాతో పాటు 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 2 గ్రా. కార్బెండజిమ్ + మ్యాంకోజెల్ మందును లీటరుకు నీటిని కలిపి నేలా బాగా తడిచేలా మొక్క మొదళ్ల చుట్టూ పోయాలి.
కంది
●నీటి ముంపుకు గురైన కంది పంటలో ఫైటాఫ్తోర ఎండుతెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు వర్షాలు తగ్గాక 2 గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేలా మొక్క మొదళ్ల చుట్టూ పోయాలి
రసాయన ఎరువులు వినియోగించొద్దు
పంటల రక్షణకు జాగ్రత్తలు పాటించాలి
కేవీకే సేద్య విభాగం శాస్త్రవేత్త
డాక్టర్ భరత్
కలుపు మందు తగిన మోతాదులో..
ఇల్లెందురూరల్: వారం రోజులపాటు కురిసిన అధిక వర్షాలతో పత్తి, మొక్కజొన్న చేలల్లో పైరుతోపాటు కలుపు మొక్కలు కూడా ఏపుగా పెరుగుతున్నాయి. దీంతో పంటకు నష్టం జరిగి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు చేలల్లో కలుపు తీత పనులు చేపట్టారు. మరి కొందరు కలుపు మందు పిచికారీ చేస్తున్నారు. విచ్చలవిడిగా కలుపు మందులు పిచికారీ చేస్తే పంటనష్టపోయే అవకాశం ఉందని, తగిన మోతాదులో, పంటలపై పడకుండా పిచికారీ చేయాలని ఇల్లెందు వ్యవసాయశాఖ అధికారి సతీష్ సూచించారు. వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి జాగ్రత్తలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వర్షాలు.. సస్యరక్షణ