
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి
● పరీక్ష రాస్తుండగా ఫిట్స్, ఆస్పత్రికి తరలించగా కన్నుమూత ● న్యాయం చేయాలంటూ ఆస్పత్రి వద్ద ధర్నా
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గొల్లగూడెంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థిని భూక్యా ప్రతిమ(15) సోమవారం మృతి చెందింది. కూసుమంచి మండలం బోడియాతండా గ్రామపంచా యతీ నామతండాకు చెందిన భూక్యా రమేష్ – బూబమ్మ కుమార్తె ప్రతిమ పదో తరగతి చదువుతోంది. మధ్యాహ్నం ఆమె ఎఫ్‌ఏ–1 సోషల్ పరీక్ష రాస్తుండగా ఫిట్స్ వచ్చాయి. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలలోని ఏఎన్‌ఎంతో ప్రాథమిక చికిత్స చేయించాక ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ప్రతిమ మృతి చెందింది.
న్యాయం చేయాలని ధర్నా
ప్రతిమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మార్చురికీ తరలిస్తుండగా బంధువులు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కుమార్తె ఎలా చనిపోయిందో చెప్పాలంటూ ప్రతిమ తండ్రి రమేష్ స్ట్రెచర్‌కు అడ్డుగా పడుకున్నాడు. అంతలోనే విద్యార్థి సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో చేరుకుని ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యంతోనే విద్యార్థిని మృతి చెందిందంటూ ఆందోళన చేపట్టారు. ఆమె కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని బైఠాయించగా పోలీసులు వారికి పక్కకు తొలగించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఆర్‌డీఓ నర్సింహారావు అక్కడికి చేరుకుని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి బంధువులకు హామీ ఇచ్చారు.
పాఠశాలలో డీడీ విచారణ
విద్యార్థి ప్రతిమ మృతి నేపథ్యాన గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి ఆశ్రమ పాఠశాలలో విచారణ చేపట్టారు. ఉదయం నుంచి విద్యార్థిని ఎలా ఉందో ఆరా తీసిన ఆమె అక్కడి నుంచి ఆస్పత్రికి వచ్చి బంధువులతో మాట్లాడారు. అయితే, ఆస్పత్రిలో ప్రతిమను చేర్పించిన ఉపాధ్యాయులు అక్కడ లేకపోవడంపై బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి