
ఆవాసం ఉండేనా!
ఆతిథ్యం మెచ్చి..
● జిల్లా అటవీ ప్రాంతంలో ఆరు నెలలుగా పులి సంచారం ! ● కొన్నేళ్లుగా అతిథిలా వచ్చిపోతున్న జాతీయ జంతువు ● ఆవాసం ఏర్పాటు చేసుకునేలా అటవీశాఖ ప్రయత్నాలు ● నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం
పాల్వంచరూరల్: అడవిలో అలజడి ఉంటే పులి అక్కడ నుంచి మరోప్రాంతానికి వెళ్లిపోతుందని, నిశబ్దంగా ఉండే అటవీప్రాంతంలోనే ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. జిల్లా అటవీ ప్రాంతంలో ఆరునెలలుగా పులి (భద్ర) సంచరిస్తోంది. జాతీయ జంతువు అడవి దాటి వలస వెళ్లకుండా అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో జిల్లా అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు పులులను వేటాడి చంపిన దాఖ లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పులి భద్రమేనా అనేది చర్చనీయాంశంగా మారింది.
అతిథిలా వచ్చిపోతోంది..
కేంద్ర ప్రభుత్వం 1975లో కిన్నెరసాని అభయారణ్యం ఏర్పాటు చేసింది. దీని విస్తీర్ణం 634.4 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇక్కడ జింకలు, కొండ గొర్రెలు, సాంబర్లు, దున్నలు, చుక్కల దుప్పులు, అడవి పందులు, కుందేళ్లు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు వంటి జంతువులు అధికంగా ఉన్నా యి. జిల్లా వ్యాప్తంగా పది లక్షల ఎకరాల మేర అడవులు విస్తరించాయి. దట్టమైన అడవి, ఆహారానికి వన్యప్రాణులు ఉన్నా పులి మాత్రం కొన్నేళ్లుగా అతిథిలా వచ్చిపోతోంది.
మూడేళ్లుగా కన్పించక..
జిల్లా అటవీ ప్రాంతంలోని కిన్నెరసాని అభయారణ్యంలో మర్కోడు, రంగాపురం, అనంతోగు, మల్లెపల్లితోగు ప్రాంతాల్లో ఉన్న దట్టమైన అడవిలో పెద్దపులుల సంచారం ఉండేది. ఛత్తీస్‌గఢ్ నుంచి గొత్తికోయలు వలస వచ్చి జిల్లా అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు లక్షల ఎకరాలకు పైగా పోడు సాగు చేపట్టారు. చెట్ల నరికివేత, ఆక్రమణతో దట్టమైన అటవీ ప్రాంతం పలచపడింది. ఫలితంగా పులులు ఇక్కడ నివాసం ఉండలేక వలసబాట పట్టాయి. 2018లో జరిగిన పులుల గణనలో ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో పులి సంచారం కన్పించలేదు. మళ్లీ 2020 డిసెంబర్, 2021 జనవరిలో పెద్దపులి కన్పించింది. కానీ ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోయింది. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా అటవీ ప్రాంతానికి వచ్చింది. అప్పటి నుంచి ఆరు నెలలుగా ఇక్కడే సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ పులికి భద్ర అని నామకరణం చేశారు. కాగా అలజడిలేని అడవిలో జింకలు, సాంబార్లు అధికంగా ఉన్న ప్రాంతంలోనే పులి సంచారం ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక్కడే ఉండేలా..
అభయారణ్యంలో దట్టమైన అడవి, ఆవాస యోగ్యం, వన్యప్రాణులున్న ప్రాంతం రంగాపురం, మల్లెతోగు అటవీ ప్రాంతంలో అభివృద్ధిపై దృష్టి సారించాం. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మంజూరు చేస్తున్న కంపా స్కీమ్ నిధులతో నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, 200 హెక్టార్లలో గడ్డి క్షేత్రాలు, 86 సోలార్ పంప్‌లు, సాసర్ వెల్స్, 150 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నాం. పులి ఆహారమైన వన్యప్రాణుల సంఖ్య కూడా పెరిగింది. భద్ర జిల్లా అడవిలోనే ఉండేలా ప్రయత్నిస్తున్నాం.
–కృష్ణాగౌడ్, జిల్లా అటవీశాఖాధికారి

ఆవాసం ఉండేనా!