సౌరప్లాంట్లపై అవగాహన సదస్సులో ఎన్పీడీసీఎల్ సీఎండీ
ఖమ్మంవ్యవసాయం: ఆసక్తి ఉన్న రైతులు పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తి, నవీన శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా పీఎం కుసుమ్ పథకాన్ని రూపొందించిందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్లాంట్ల ద్వారా రైతులు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను 25ఏళ్ల పాటు సంస్థలు కొనుగోలు చేస్తూ యూనిట్‌కు రూ.3.13 చెల్లిస్తాయని తెలిపారు. జిల్లాలో సౌరప్లాంట్లకు దరఖాస్తు చేసుకున్న 80 మంది రైతులకు ఖమ్మంలో శనివారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్ శ్రీజ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, టీజీ రెడ్‌కో మేనేజర్ పి.అజయ్‌కుమార్ పాల్గొనగా.. హనుమకొండ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ సౌరప్లాంట్ల ఏర్పాటుతో లాభాలను వివరించారు. 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. వ్యక్తిగతంగా లేక సమూహాలుగా ఏర్పాటుచేసుకునే అవకాశముండగా, 33/11 కేవీ సబ్ స్టేషన్లకు ఐదు కిలోమీటర్ల దూరాన స్థలం ఉండాలని చెప్పారు.