● తాజా బడ్జెట్‌లో యాదాద్రి, వేములవాడకు రూ.వందల కోట్లు ● భద్రాచలానికి మాత్రం మొండిచేయి.. ● డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు ఎప్పుడో ?
అథారిటీ ఎందుకంటే..
ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలంటే సాధారణ పద్ధతులు సరిపోవు. అందుకే ప్రభుత్వాలు ప్రత్యేక అథారిటీలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇటీవల ఖమ్మం నగరాభివృద్ధికి స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఎప్పటినుంచో పని చేస్తోంది. టెంపుల్ టౌన్‌గా ఉన్న భద్రాచలం అభివృద్ధికి కూడా ఈ తరహా ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
భద్రాచలం: ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా భద్రాచలం పట్టణం, రామాలయ అభివృద్ధికి మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. ప్రతీ బడ్జెట్ సమయంలో భక్తులు, స్థానికులు ఎదురుచూస్తున్నా.. వారికి నిరాశే మిగులుతోంది. తాజా బడ్జెట్‌లో యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీకి రూ.200 కోట్లు, వేములవాడ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు ప్రకటించి.. భద్రాచలానికి గుండుసున్నా చూపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘భద్రాచలం టెంపుల్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ’ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
రామదాసు కాలం నాటిదే..
యాదాద్రి, వేములవాడలకు డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం..ప్రతీ బడ్జెట్‌లో నిధులు కేటాయించి భక్తులకు, స్థానికులకు అవసరమైన వసతులు కల్పిస్తోంది. కానీ భద్రాచలం రామాలయానికి, పట్టణాభివృద్ధికి ఎలాంటి అథారిటీ లేదు. ఎప్పుడో భక్త రామదాసు నిర్మించిన ఆలయానికి కొద్దిపాటి మార్పులు, చేర్పులు, సీతారాముల కల్యాణానికి నిర్మించిన మిథిలా స్టేడియం తప్ప ఇతర అభివృద్ధి పనులేవీ జరగలేదు. కల్యాణానికి ప్రతీ ఏడాది భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో మిథిలా స్టేడియాన్ని ఆధునాతనంగా పునఃనిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో రెండుమార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనుల ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు. ఆలయం పక్కన మాఢ వీధుల విస్తరణకు రెవెన్యూ అధికారులు ఇటీవల భూ సేకరణ చేసి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించినా దానికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఇక రామాలయ హుండీ ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, ఉత్సవాల నిర్వహణకే సరిపోతుండగా భక్తులకు వసతుల సమస్య అపరిష్కృతంగానే ఉంటోంది.
ఇప్పటికీ వెనుకబాటే..
భద్రాచలం పట్టణం అభివృద్ధిలో ఇప్పటికీ వెనుకబడే ఉంది. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న భద్రాచలంలోని దాదాపు 25 కాలనీల్లో లక్ష వరకు జనాభా నివసిస్తున్నారు. దీన్ని మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వం యోచించినా ఏజెన్సీ చట్టాల కారణంగా న్యాయపరంగా సాధ్యం కావడం లేదు. అయితే జనాభాకు తగినట్లుగా వసతుల కల్పనలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోంది.
అన్ని విభాగాలను సమన్వయం చేస్తేనే..
భద్రాచలం అభివద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి ప్రకటనలు చేసిందే తప్ప రూపాయి కూడా మంజూరు చేయలేదు. వరదల సందర్భంగా రూ. 1,000 కోట్లు ప్రకటించినా అందులోనూ పైసా రాలేదు. అయితే ఆ స్థాయిలో నిధులు మంజూరైనా ఇక్కడ పనులు చేపట్టడం అంత తేలికై న అంశం కాదు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంలో స్థల సమస్య తీవ్రంగా మారింది. ఇక్కడ కీలకమైన దేవాదాయ, పంచాయతీరాజ్, రెవెన్యూ, అటవీశాఖ, ఐటీడీఏ, పోలీస్, పర్యాటక విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి పనులు సాధ్యమని, లేదంటే తేనెతుట్టెను కదిల్చినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విభాగం పనులు ప్రారంభిస్తే మరో విభాగం అడ్డుకునే పరిస్థితుల నేపథ్యంలో అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.