కొత్తగూడెంటౌన్: ఆపరేషన్ చేయూతలో భాగంగా మావోయిస్టు పార్టీకి చెందిన 64 మంది మల్టీజోన్ –1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట శనివారం లొంగిపోయారు. వారిలో 48 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.16లక్షల ఆర్థిక సాయాన్ని ఐజీ వారికి అందజేశారు. ఈ మేరకు హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని, దీనికి ఆకర్షితులైన మావోయిస్టులు లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రస్తుతం లొంగిపోయిన వారిలో బస్తర్ ఏసీఎం మడకం జిమ్మి అలియాస్ లక్ష్మి, పార్టీ క్రియాశీలక సభ్యులు 10 మంది, ప్రజా విప్లవ సంఘం సభ్యులు తొమ్మిది మందితో పాటు ఇతర అనుబంధ సంఘాల సభ్యులు ఉన్నారని వివరించారు. గత రెండున్నర నెలల్లో 122 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మిగితా వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆదివాసీ గిరిజనుల్లో మావోయిస్టులపై నమ్మకం, ఆదరణ సన్నగిల్లుతున్నాయని చెప్పారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు అనుసరిస్తున్న మావోలు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఏజెన్సీ అబివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదనే కారణంతో అమాయక ఆదివాసీలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలు వచ్చేలా పోలీసు యంత్రాంగం ఎప్పుడూ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, సీఆర్‌పీఎఫ్ కమాండెంట్‌లు రితేష్‌ఠాకూర్, ప్రీత, రాజేష్ డోగ్రా తదితరులు పాల్గొన్నారు.
ఐజీకి ఘన స్వాగతం..
జిల్లా పర్యటనలో భాగంగా ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి తొలుత ఇల్లెందు క్రాస్ రోడ్‌లోని సింగరేణి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హేమచంద్రాపురంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజ్, షీ టీం ఎస్సై రమాదేవి ఆధ్వర్యంలో పోలీసులు ఘనంగా స్వాగతం పలికి పరేడ్ నిర్వహించగా, ఐజీ గౌరవ వందనం స్వీకరించారు.
మిగిలిన వారూ జనజీవన స్రవంతిలో కలవాలి
మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సూచన
ఒక్కొక్కరికి రూ.25వేల సాయం
అందజేత