భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్–సౌజన్య దంపతులు రూ.లక్ష చెక్కు ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయ పీఆర్వో సాయిబాబు తదతరులు పాల్గొన్నారు. కాగా, ఆదాయ పన్ను శాఖ ప్రన్సిపల్ కమిషనర్ దండా శ్రీనివాస్–లక్ష్మితాయారు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. వారి వెంట అధికారులు నెల్లూరు సింధు, ఉమామహేశ్వరరావు, ప్రియాంక, రాంజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, సుబ్బారావు ఉన్నారు.
రేపటి నుంచి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటన
భద్రాచలంటౌన్: జిల్లాలోని చండ్రుగొండ, అశ్వారావుపేట మండలాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం చండ్రుగొండ మండలం సీతాయిగూడెం ప్రాజెక్టును సందర్శిస్తారని, ఆ తర్వాత చండ్రుకుంట గ్రామంలోని గిరిజనుల పోడు భూములను పరిశీలించి రైతులతో సమావేశం అవుతారని వివరించారు. సాయంత్రం పెదవాగు ప్రాజెక్ట్ సందర్శించి రాత్రికి అశ్వారావుపేటలో బస చేస్తారని తెలిపారు. 18వ తేదీ ఉదయం పండువారిగూడెం, గాండ్లగూడెం, కావడి గుండాల గ్రామాల్లో గిరిజన సంఘాల నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలను సందర్శిస్తారని తెలిపారు. సంబంధిత తహసీల్దార్లు, ఇరిగేషన్, ఐటీడీఏ అధికారులు ఈ పర్యటనలో పాల్గొనాలని సూచించారు.
పెదవాగును పరిశీలించిన అధికారులు..
అశ్వారావుపేటరూరల్: మండలంలోని గుమ్మడవల్లి వద్ద గల పెదవాగు ప్రాజెక్ట్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సందర్శించనున్న నేపథ్యంలో ఇరిగేషన్ ఏఈఈ శ్రీనివాస్, సీఐ కరుణాకర్, ఎస్సై యయాతిరాజు శనివారం పరిశీలించారు. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షం, వరదతో ప్రాజెక్ట్ ప్రధాన ఆనకట్టకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా, కమిషన్ సభ్యుల బృందం ప్రాజెక్టు వద్దకు రానున్నారు.
‘గూడెం’ వాసికి
సాహిత్య రత్న అవార్డు
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం 8వ వార్డుకు చెందిన సింగరేణి మాజీ ఉద్యోగి జినుకల సదానందానికి సాహిత్య రత్న అవార్డు లభించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తీరా అర్ట్స్ ఆకాడమీ వారు సాంస్కృతిక, ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందించారు. కాగా, కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్‌లైన్ గనిలో సుమారు 35 సంవత్సరాలు పనిచేసిన సదానందం.. సంస్థ అభివృద్ధికి కృషి చేయడమే కాక తన కథలు, కవితలు, నాటికలతో కార్మికులను చైతన్యపరిచారు. కోలిండియా స్థాయిలోనూ అనేక ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు సాధించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం శాలేంరాజు సదానందాన్ని అభినందించారు.