కొత్తగూడెంఅర్బన్: గత నెల 10వ తేదీన కూలీ పని ఉందంటూ యువతిని ఆటోలో లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన నర్సింహారావు.. కూలి పని ఉందని, అందుకోసం రూ.700 చెల్లిస్తానని చెప్పి ఇద్దరు మహిళలను మహబూబాబాద్‌లో గతంలో చోరీ చేసిన ఆటోలో ఎక్కించుకొని పాల్వంచ దగ్గరలోని పెట్రోల్ బంకు వద్ద ఉన్న సమ్మక్క – సారక్క ఆలయం వద్ద ఓ మహిళను దించాడు. కూరగాలయలు తీసుకొస్తామని మరో మహిళను తీసుకొని అనిశెట్టిపల్లి అటవీ ప్రాంతానికి తీసువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. మహిళ ఎదిరించడంతో జేబులో నుంచి కత్తి తీసి బెదిరించే క్రమంలో మహిళ చెంపకు గాయమైంది. దీంతో నర్సింహారావు ఆటోను అక్కడే వదిలేసి పారిపోయాడు. జల్సాలకు అలవాటు పడిన నర్సింహారావు హన్మకొండలోని కోర్టు పరిసరాల్లో ఉన్న ఆటో, అందులోని సెల్‌ఫోన్‌ను చోరీ చేసి, పాపకొల్లు వస్తూ మధ్యలో వినోబానగర్‌లోని ఓ ఇంట్లో సెల్‌ఫోన్‌ను చోరీ చేశాడు. శనివారం ఇల్లెందు క్రాస్ రోడ్డు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో నర్సింహారావును పోలీసులు పట్టుకుని విచారించగా చోరీల విషయం తెలిసింది. దీంతో నర్సింహారావు చోరీ చేసిన సెల్‌ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.