భద్రాచలంఅర్బన్: పట్టణంలోని అశోక్‌నగర్‌కాలనీకి చెందిన గడ్డం ఆకాష్ (20) గురువారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆకాష్ రెండు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఎంతకూ కడుపునొప్పి తగ్గకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుడు అంబేడ్కర్ సెంటర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్‌ఐ విజయలక్ష్మి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
టేకులపల్లి: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను టేకులపల్లి పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్‌ఐ సురేశ్ కథనం ప్రకారం.. శంభునిగూడెం సమీపంలోని మొర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుక లోడుతో వస్తున్న రెండు ట్రాక్టర్లను బొమ్మనపల్లి వద్ద పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రవాణా చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వివాహిత అదృశ్యంపై కేసు
భద్రాచలంఅర్బన్: వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఏఎస్‌ఆర్‌కాలనీకి చెందిన రాజేశ్ సతీమణి మనీష ఈ నెల 4వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె భర్త రాజేశ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు.
చికిత్స పొందుతున్న హెచ్‌ఎం మృతి
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని వెంగళరావునగర్ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయుడు అగ్గి రవి (42) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటకు చెందిన ఆయన ప్రస్తుతం భీమునిగూడెం ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. సత్తుపల్లి నుంచి రాకపోకలు సాగిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఎర్రగుంటకు వెళ్లే క్రమాన జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రవిని ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భార్య కవిత దమ్మపేట మండలం మొండివర్రె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రవి సోదరుడు కూడా గతంలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందినట్లు తెలిసింది.