సర్వేలతోనే సరి ..
భద్రాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుగా ఉంది. రైల్వే పరంగా ఇతర రాష్ట్రాలను కలుపుతూ గతంలో భద్రాచలంరోడ్ – కొవ్వూరు, కొత్తగూడెం – కొండపల్లి, మణుగూరు – రామగుండం, మణుగూరు – కిరండోల్ మార్గాల నిర్మాణానికి పలుమార్లు సర్వే చేశారు. దీంతో పాటు డోర్నకల్ జంక్షన్ – భద్రాచలంరోడ్ డబ్లింగ్ పనులకూ సర్వే జరిగింది. ఇబ్బడి ముబ్బడిగా లైన్లకు సర్వే చేసినా నిధులు మాత్రం మంజూరు కాలేదు. కానీ గతేడాది అనూహ్యంగా మల్కన్‌గిరి – భద్రాచలం – పాండురంగాపురం వరకు కొత్త లైన్‌ను కేంద్రం మంజూరు చేసింది. దీంతో పాటు ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిన భద్రాచలంరోడ్ – డోర్నకల్ జంక్షన్ డబ్లింగ్, మణుగూరు – రామగుండం లైన్లనూ నిర్మిస్తామని ప్రకటించింది.
స్వయంగా ప్రకటించిన కేంద్రం..
భద్రాచలంరోడ్ – మణుగూరు రైల్వే లైన్‌లో ఉన్న పాండురంగాపురం స్టేషన్ నుంచి భద్రాచలం మీదుగా ఒడిశాలోని మల్కన్‌గిరి – జైపూర్ – గుణుపూర్ మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ వరకు కొత్తగా రైలు మార్గం నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా గతేడాది ఈ ప్రాజెక్ట్‌ను మంజూరు చేశామని, త్వరితగతిన పనులు ప్రారంభిస్తామని పేర్కొంది. దాదాపు 270 కి.మీ. నిడివి కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.7,383 కోట్ల వ్యయం అవుతుంది. కొండలు, అడవుల గుండా ఈ మార్గం నిర్మించాలి. పర్యావరణ అనుమతులు సాధిస్తూ భారీ వంతెనలతో కూడిన ఈ ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు దశాబ్దానికి పైగా సమయం పట్టినా ఆశ్చర్యం లేదు.
పని చిన్నదే.. ఫలితం పెద్దది
మల్కన్‌గిరి – భద్రాచలం రైల్వేలైన్‌లో తెలంగాణ పరిధిలోకి వచ్చే పాండురంగాపురం నుంచి సారపాక వరకు 12 కి.మీ. మేరకు నిర్మించాల్సిన లైన్‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. కేవలం 12 కి.మీ. లైన్ నిర్మించడం ద్వారా పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణానికి తక్షణమే రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని ఆయన కోరారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ లైన్ నిర్మాణానికి నిధులేమైనా మంజూరయ్యాయా లేదా అనేది తేలడం లేదు. కనీసం మంత్రి తుమ్మల విజ్ఞప్తికి సానుకూల స్పందన వచ్చినా రామయ్య భక్తులకు తీపి కబురు అందినట్టే. ఇక గతంలో జిల్లా నుంచి నడిచిన పాత రైళ్ల పునరుద్ధరణ, షిర్డీ, తిరుపతి, బెల్లంపల్లితో పాటు సత్తుపల్లి మార్గంలో కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రకటన వంటివి ఇప్పటికీ ఎండమావిగానే మిగులుతున్నాయి.
నిధులు కేటాయించారా..?
మణుగూరు – రామగుండం రైల్వేలైన్‌ను 1999లో ప్రతిపాదించారు. అనేక సార్లు సర్వేలు జరిగిన తర్వాత గత సెప్టెంబర్‌లో గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. 207 కి.మీ.నిడివి గల ఈ లైన్ నిర్మాణానికి రూ.3,600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఈ లైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ సాగుతోంది. ఇక భద్రాచలంరోడ్ – డోర్నకల్ మధ్య ప్రస్తుతం సింగిల్ లైన్ ఉంది. పెరిగిన రద్దీ కారణంగా దీన్ని డబ్లింగ్ చేయాలని నిర్ణయించారు. 54.65 కి.మీ. నిడివి గల ఈ లైన్ నిర్మాణానికి భూసేకరణ పూర్తయింది. నిర్మాణ వ్యయం రూ.770 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నిధుల కేటాయింపు జరిగితే పనులు ప్రారంభించడమే తరువాయి అన్నట్టుగా ఉంది ఈ లైన్ పరిస్థితి. అయితే 2025 – 26 బడ్జెట్‌లో ఈ రెండు పనులకు నిధులు కేటాయించారా లేదా అనే సందేహం నెలకొంది. మరోవైపు భద్రాచలంరోడ్ – కొవ్వూరు మార్గం నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రకటనలు ఏపీ నుంచి వినిపిస్తున్నాయి.
గతంలో జిల్లాకు పలు రైల్వే లైన్లు మంజూరు
నిధుల కేటాయింపు వివరాలు పింక్‌బుక్‌లో నమోదు
కేంద్ర బడ్జెట్ ప్రకటించి నెల రోజులైనా వెల్లడించని సర్కారు
కొత్త ప్రాజెక్టులకు నిధుల విడుదలపై స్పష్టత కరువు
కేంద్ర బడ్జెట్ ప్రకటించి నెలరోజులు దాటినా రైల్వే పరంగా కీలకమైన పింక్‌బుక్ వివరాలు ఇప్పటికీ వెల్లడి కాలేదు. దీంతో జిల్లాకు సంబంధించి ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు వచ్చాయి.. ఇప్పటికే మంజూరైన పనుల్లో పురోగతి ఎలా ఉంటుంది..అనే అంశాలపై స్పష్టత రావడం లేదు.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం