పేరు మారినా సేవలు అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

పేరు మారినా సేవలు అంతంతే..

Mar 12 2025 8:19 AM | Updated on Mar 12 2025 8:14 AM

● సమస్యలకు నిలయంగా అశ్వారావుపేట పట్టణం ● ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్న మున్సిపల్‌ పాలన

అశ్వారావుపేట : ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు అశ్వారావుపేట మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. కానీ సేవలు మాత్రం ఇంకా గ్రామ పంచాయతీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మున్సిపాలిటీకి ఇన్‌చార్జ్‌ కమిషనర్‌, జేఏఓ, టీపీఓలను నియమించిన ప్రభుత్వం.. ఆ తర్వాత పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తోంది. రెగ్యులర్‌ అధికారులను నియమించకపోవడం, అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. బిల్‌ కలెక్టర్‌లు వసూలు చేసే పన్నుల జమ, ఖర్చులు చూసుకోవడం మినహా మరో పనేమీ జరగడం లేదు. ఇంటి అనుమతుల కోసం వచ్చేవారిని ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో వెనక్కు పంపుతున్నారు. పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. అశ్వారావుపేట, గుర్రాలచెరువు, పేరాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే మల్టీపర్పస్‌ వర్కర్లే ప్రస్తుతం మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణ పరిధిలోని జాతీయ రహదారిని ఊడ్చిన దాఖలాలు లేవు. రహదారి మొత్తం దుమ్ము, ధూళితో దర్శనమిస్తుండగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక జాతీయ రహదారి వెంట కూడా వీధి దీపాలు వెలగడం లేదు. తాగునీటి సరఫరా కూడా గతం కంటే మెరుగుపడలేదు. ఖమ్మం రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌ వద్ద తాగునీటి పైప్‌లైన్‌ నెల రోజులుగా లీకవుతూ నీళ్లు వృథాగా పోతున్నాయి. ఆ తర్వాత అవే మురికి నీరు పైపులైన్‌ ద్వారా సరఫరా అవుతున్నాయి. ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు వచ్చి పగటి వేళలో నీళ్లు తోడి పోతుండగా మరుసటి రోజు తెల్లారేసరికి మళ్లీ గుంత నిండుతోంది. ఇదే నిత్యకృత్యం తప్ప సమస్య పరిష్కారం కాలేదు. గ్రామపంచాయతీలుగా ఉన్నప్పటి తాగునీటి ట్యాంకర్లను మోడల్‌ కాలనీలో అనధికారికంగా ఇళ్ల నిర్మాణాలకు, పునాదుల్లో నీళ్లు నింపేందుకు వినియోగిస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినా పాత పంచాయతీ కార్యదర్శులే సేవలందిస్తున్నారు. మున్సిపల్‌ పాలన ఎప్పుడు ప్రారంభిస్తారని ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ సుజాతను వివరణ కోరగా.. ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బంది స్థాయిలో రాలేదని.. మరికొంత సమయం పడుతుందని చెప్పారు.

పేరు మారినా సేవలు అంతంతే..1
1/1

పేరు మారినా సేవలు అంతంతే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement