మున్నేటిలో పడి విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

మున్నేటిలో పడి విద్యార్థి మృతి

Mar 10 2025 12:28 AM | Updated on Mar 10 2025 12:28 AM

మున్నేటిలో పడి విద్యార్థి మృతి

మున్నేటిలో పడి విద్యార్థి మృతి

ఖమ్మంరూరల్‌: మండలంలోని గోళ్లపాడు వద్ద మున్నేటిలో ప్రమాదవశాత్తు పడి విద్యార్థి ఎర్రం మహేశ్‌ (22) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌ ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్‌ చదువుతూ.. గట్టయ్యసెంటర్‌లో స్నేహితులతో కలిసి అద్దెకుంటున్నాడు. కాగా, ఈ నెల 8న స్నేహితులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లి అందులో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ అన్నం శ్రీనివాసరావు, సిబ్బంది సాయంతో మృతదేహాన్ని వెలికి తాశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు.

చెట్టుకు ఢీకొన్న బైక్‌: ఒకరు మృతి

మరొకరి పరిస్థితి విషమం

టేకులపల్లి: వేగంగా వచ్చిన బైక్‌ చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేశ్‌ కథనం ప్రకారం.. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన జోగా వంశీ (22), పొడుగు ప్రవీణ్‌ బైక్‌పై టేకులపల్లి మండలంలో శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో వేగంగా బైక్‌ నడుపుతూ తుమ్మలచెలక క్రాస్‌రోడ్‌ సమీపంలో అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వంశీ మృతిచెందాడు. ప్రవీణ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి వద్ద ఎదుళ్లవాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా శనివారం రాత్రి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకుని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ శివరామకృష్ట ఆదివారం తెలిపారు. డ్రైవర్‌ అంచ రమేశ్‌, ట్రాక్టర్‌ యజమాని పి.రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

పాల్వంచరూరల్‌: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ ఇంట్లో ఉన్న మాత్రలు అధికంగా మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పాతసూరారంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పాత సూరారం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ ఆదివారం ఇంట్లో గొడవల కారణంగా మాత్రలు అధికంగా మింగడంతో ఆపస్మారకస్థితికి చేరింది. కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement