
సమానత్వం కోసం ఉద్యమించాలి
భద్రాచలంఅర్బన్: మహిళలంతా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వంపై ఉద్యమించాలని, మహిళలపై జరుగుతున్న హింసను తిప్పికొట్టాలని ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ పిలుపునిచ్చారు. పీఓడబ్ల్యూ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు కప్పల సూర్యకాంతం అధ్యక్షతన నిర్వహించారు. అందే మంగ మాట్లాడుతూ.. నాడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మొత్తం దెబ్బతిని పరిశ్రమలకు పనికి వెళ్లిన వారిని శ్రమదోపిడీ చేసి విశ్రాంతి తీసుకుంటే కూడా వేతనం కట్ చేసి ఇచ్చేవారని, ఈ దోపిడీ నుంచి పుట్టిన పోరాట ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు. సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.