
ఇక ఆన్‌లైన్ చెల్లింపులు!
● మధ్యాహ్న భోజన బిల్లుల్లో జాప్యం లేకుండా చర్యలు ● భద్రాద్రితోపాటు పెద్దపల్లి జిల్లా పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక ● పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన సాంకేతిక నిపుణులు ● ఎండీఎం కార్మికుల సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వ కసరత్తు
కొత్తగూడెంఅర్బన్: మధ్యాహ్న భోజన పథకం(ఎండీఎం) కార్మికులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. వేతనాలు, బిల్లులు ప్రతి నెలా విడుదల కాకపోవడంతో అవస్థ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ బిల్లులు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. గత ఫిబ్రవరిలో జిల్లాలో కొత్తగూడెం మండలంలోని పాఠశాలల్లో కార్మికుల వేతనాలు, బిల్లుల పెండింగ్ తదితర అంశాలపై కలెక్టర్ జితేష్ వి.పాటిల్, డీఈఓ, ఎంఈఓతో చర్చించారు. విద్యార్థుల ఫేస్ రికగ్నేషన్‌ను మరింత అభివృద్ధి పరిచి కార్మికులకు వేతనాలు, బిల్లులు చెల్లిస్తే జాప్యం ఉండదని కలెక్టర్ నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించి ఆమోదించింది. ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఆలస్యమవుతోందని, నేరుగా ఆన్‌లైన్ నుంచే బిల్లులు చెల్లించే అవకాశాలను పరిశీలిస్తున్నామని, ఇందుకు యాప్ రూపొందిస్తున్నామని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసుకుని, నెల రోజులపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులను ఆన్‌లైన్ ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్ బిల్లులతో ఎదురుచూపులకు చెక్ పడే అవకాశం ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
2,150 మంది కార్మికులు
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు 2,150 మంది ఉన్నారు. వీరందరికీ ఒకేసారి బిల్లులు మంజూరు కావడం లేదు. జిల్లాలోని 23 మండలాలు ఉండగా, అన్నీ మండలాలకు ఒకేసారి బిల్లులు రావడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి పది మండలాలకు వస్తే, రెండో దఫా, మూడో దఫాలో మిగతా మండలాలకు బిల్లులు మంజూరవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడంతో ఇక్కడి ఎండీఎం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా బిల్లుల చెల్లింపు ప్రక్రియ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.