
చల్లసముద్రం సర్పంచ్, కార్యదర్శులను సన్మానిస్తున్న కలెక్టర్, డీపీఓ
చుంచుపల్లి: జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులకు అర్హత సాధించాయంటే ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది సమష్టి కృషి ఫలితమేనని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఉత్తమ అవార్డులకు ఎంపికై న గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులను ఐడీఓసీలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 10 మండలాల్లోని 17 గ్రామ పంచాయతీలు 27 అంశాల్లో జాతీయ స్థాయి అవార్డులకు అర్హత సాధించి రోల్ మోడల్‌గా నిలిచాయని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో సమస్యలను ఎప్పటికపుడు ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, మండల, జిల్లా అధికారులు సమీక్షించుకుంటూ సమన్వయంతో ముందుకుపోతున్నారని అన్నారు. మూడేళ్ల క్రితం పంచాయతీల్లో అనేక సమస్యలు ఉండేవని, నేడు ప్రతి గ్రామం డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె, బృహత్ ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు, వైకుంఠధామాలతో అభివృద్ధికి నాంది పలుకుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీపీఓ రమాకాంత్, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బందికి అభినందన
సూపర్‌బజార్(కొత్తగూడెం): క్షయ వ్యాధి నిర్మూలనలో రాష్ట్రంలో జిల్లా రజిత పతకం సాధించిన సందర్భంగా డీఎంహెచ్‌ఓ శిరీష, జిల్లా అదనపు క్షయ నివారణాధికారి శ్రీనివాసరావు కలెక్టర్ అనుదీప్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమష్టి కృషితో భవిష్యత్‌లో బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీడీఎంహెచ్‌ఓ సుకృత, స్టేట్ కన్సల్టెంట్ జె.వి. శ్రీనివాసరావు, చైతన్య, ఇమ్మానియేల్, దుర్గ పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్లకు ధ్రువీకరణ పత్రాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు విద్య, ఉపాధి అవకాశాలు పొందడానికి ట్రాన్స్‌జెండర్లకు ఐడీ కార్డులు, ధ్రువీకరణ పత్రాలు ఉపయోగపడతా యని కలెక్టర్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారికి ఐడీ కార్డులు అందించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా, వరప్రసాద్, నరేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.
‘పోషణ్ పక్వాడ’ను పటిష్టంగా నిర్వహించాలి
కొత్తగూడెంఅర్బన్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. సంబంధిత పోస్టర్లను శనివారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏప్రిల్ 3 వరకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా సంక్షేమాధికారి లేనీనా, జెడ్పి సీఈఓ విద్యాలత, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీపీఓ రమాకాంత్, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్
‘ఉత్తమ’ సర్పంచ్‌లకు సన్మానం