22న ఓటర్ల జాబితా.. రిజర్వేషన్లపై ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

22న ఓటర్ల జాబితా.. రిజర్వేషన్లపై ఉత్కంఠ

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

22న ఓటర్ల జాబితా.. రిజర్వేషన్లపై ఉత్కంఠ నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) పాలకవర్గ ఎన్నికల నిర్వహణ దిశగా ప్రక్రియ ఊపందుకుంది. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ నెల 22వ తేదీన డివిజన్ల వారీగా ఫొటో ఎలక్టోరల్‌ జాబితాలను ప్రచురించాలని ఆదేశించింది. వచ్చే నెల చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే దిశగా మున్సిపల్‌ యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. గుంటూరు నగరంలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అధికారికంగా కొలిక్కి వచ్చింది. గతంలో 2011 జనాభా ప్రాతిపదికన 52 డివిజన్లు ఉండగా, పరిసరాల్లోని 10 గ్రామాలను విలీనం చేయడంతో జనాభా 7,43,354కు పెరిగి వార్డుల సంఖ్య 57కు చేరింది. అయితే పెరిగిన జనాభాకు తగినట్లుగా పౌర సేవలను మరింత చేరువ చేసేందుకు, పట్టణ విస్తరణకు అనుగుణంగా డివిజన్ల సంఖ్యను 57 నుంచి 76కు పెంచుతూ ప్రభుత్వం తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పునర్విభజన జరిగిన 76 డివిజన్ల పరిధిలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం సరిహద్దులు, విస్తరించిన కాలనీలు, డోర్‌ నంబర్ల వివరాలను గెజిట్‌లో స్పష్టంగా పొందుపరిచారు. నగర శివారు ప్రాంతాలు, విలీన గ్రామాలు, ప్రధాన రహదారుల విస్తరణకు అనుగుణంగా వార్డుల రూపురేఖలను నిర్దేశించారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు ఈ సరిహద్దుల విభజనే ప్రామాణికం కానుండటంతో రాజకీయ పార్టీలు ఇప్పటికే కొత్త డివిజన్ల వారీగా లెక్కలపై దృష్టి సారించాయి.

ఎస్‌ఈసీ షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 22న 76 డివిజన్లకు సంబంధించి ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల సంఖ్యను లెక్కించేందుకు సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, పోలింగ్‌ కేంద్రాలను కేటాయించనున్నారు. సరిహద్దుల గెజిట్‌ రావడంతో ఇక అందరి కళ్లూ రిజర్వేషన్ల ప్రకటనపైనే ఉన్నాయి. సామాజిక సమీకరణాల ఆధారంగా కలెక్టర్‌ వార్డుల రిజర్వేషన్లు ప్రకటించనుండగా, గుంటూరు మేయర్‌ పీఠం ఏ వర్గానికి దక్కుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టికెట్ల ఆశావహులు ముందస్తు వ్యూహాల్లో మునిగిపోగా, ప్రధాన పార్టీల అధిష్టానాలు కూడా గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో పడ్డాయి.

76కు చేరిన డివిజన్లు

స్పష్టమైన సరిహద్దులు

నగరంలో 57 నుంచి 76కు

పెరిగిన డివిజన్లు

సరిహద్దులు, డోర్‌ నంబర్లతో

తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఈ నెల 22న ఫొటో ఎలక్టోరల్‌

జాబితాల ప్రచురణ

మేయర్‌, కార్పొరేటర్ల స్థానాల

రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement