ఏఎన్‌యూలో ఫీజుల గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూలో ఫీజుల గోల్‌మాల్‌

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

పేలుడు పదార్థాల రవాణా నిందితుడికి రిమాండ్‌

నకిలీ చలానాలు, రసీదులతో సిబ్బంది చేతివాటం

ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు, చలానాల్లో సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. పరీక్షల విభాగం, వసతి గృహాలు, ప్రిన్సిపాల్స్‌ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొంత మంది సిబ్బంది అనధికారిక, నకిలీ చలానాలు, రశీదులు సృష్టించి జేబులు నింపుకుంటున్నారు. పలువురు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ నగదుకు నకిలీ చలానాలు, రశీసులు చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నగదు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారిక బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉద్యోగులను అక్కడి నుంచి తొలగించకపోగా విచారణకు చర్యలు కూడా చేపట్టలేదు. బాలుర వసతి గృహంలోనూ విద్యార్థులకు అనధికార రశీదులు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల వర్సిటీలో నకిలీ చలానాలు, నకిలీ రశీసులతో కొందరు కింది స్థాయి సిబ్బంది ఆర్థికంగా లబ్ధిపొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గెస్ట్‌హౌస్‌లో రూముల పేరుతో వసూళ్లు వర్సిటీ లెక్కల్లో రావడం లేదనేది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా దూరవిద్యకేంద్రం కోడింగ్‌ విభాగం, పరీక్షా భవన్‌లోని సీఈ కార్యాలయంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొందరు రోజువారీ వేతన కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌, క్యాజువల్‌ లేబర్‌ సిబ్బంది వసూళ్లు లక్షలు దాటినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన నగదుపై ప్రత్యేక ఆడిట్‌ చేపట్టాల్సిన అవసరం ఉంది. కీలక విభాగాల్లో చలానాలు, రసీదు పుస్తకాలు, నగదు రిజిస్టర్లు, ఖాతాలు, ఆర్థిక లెక్కలపై స్వతంత్ర సంస్థ ద్వారా ప్రత్యేక ఆడిట్‌ చేయించి నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై పరీక్ష భవన్‌ అడిషనల్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ రెడ్డి ప్రకాశ్‌ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలైన జిలెటిన్‌ స్టిక్స్‌, ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లను రవాణా కేసులో నిందితుడైన వెంకట రామాంజనేయులును కృష్ణలంక పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించినట్లు సీఐ జె.మురళీకృష్ణ తెలిపారు.

భవనాలు కూల్చేవే..

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని రాజుపాలెంకు చెందిన అలుగు లక్ష్మీనారాయణ పాత భవనాలు కూల్చడం, స్లాబులు పగలగొట్టడం, పునాదులు తీయడం వంటి పనులు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అతని తమ్ముడు సాయి, మేనల్లుడు గుంజా వెంకట రామాంజనేయులు అతని వద్దే పనిచేస్తుంటారు. రామాంజనేయులు వడ్డేశ్వరంలో ఉంటుండగా, సాయి పెనమలూరు మండలం కానూరులోని మురళీనగర్‌లో ఉంటున్నాడు. భవనాల తొలగింపు పనుల్లో అవసరమైనప్పుడు జెలిటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు వాడుతుంటారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని లక్ష్మీనారాయణ, రామాంజనేయులు స్వగ్రామానికి వెళ్లారు. కుంట గ్రామంలో లక్ష్మీనారాయణ జెలిటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు కొనుగోలు చేశాడు. వాటిని బ్యాగ్‌లో పెట్టి సాయికి ఇవ్వాలని వీరాంజనేయులుకు ఇచ్చి వేరే పని మీద వెళ్లిపోయాడు. ఈ నెల 14వ తేదీన అతను శ్రీశైలం నుంచి విజయవాడ బస్సు ఎక్కాడు. అదేరోజు రాత్రి 10గంటల సమయంలో వారధి వద్ద దిగే తొందరలో మరో బ్యాగ్‌ తీసుకుని బస్సు దిగాడు. అంతటా అతను మురళీనగర్‌లో ఉంటున్న సాయి వద్దకు చేరుకుని బ్యాగ్‌ తెరిచి చూడగా దుస్తులు ఉన్నాయి. బ్యాగ్‌ మారిపోయిందని నిర్ధారించుకుని వడ్డేశ్వరంలోని ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలు ఉన్న ఒక్క బ్యాగ్‌ లభించిందని కలకలం రేగింది. పోలీసులు బస్సులో పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న రామాంజనేయులు బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో తన మేనమామలు లక్ష్మీనారాయణ, సాయి కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు చెప్పాడు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం రామాంజనేయులును అరెస్ట్‌ చూపించి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు లక్ష్మీనారాయణ, సాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement