న్యూస్‌రీల్
‘స్థానిక’ ఎన్నికల్లో బుద్ధి చెబుతారా?
జిల్లాలో టీడీపీ సీనియర్లను పక్కన పెట్టేసిన చినబాబు వచ్చే మంత్రి వర్గంలోనూ వారికి మొండిచేయి చూపే యత్నం కొత్తగా వచ్చిన పెమ్మసానికి కేంద్ర మంత్రి, లావుకు లోక్‌సభలో ఫ్లోర్ లీడర్ పోస్టులు మొదటిసారి గెలిచిన, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే జిల్లాలో పెత్తనం జూనియర్ల సిఫార్సుల మేరకే రాష్ట్ర, జిల్లా స్థాయి పదవుల కేటాయింపు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్లు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు
బాపట్ల
గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
గుంటూరు జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు. ఎందరో సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీలో ఉన్నారు. మొదటి నుంచీ ఈ జిల్లాలో వారే పెత్తనం చెలాయిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. జిల్లాలో చినబాబు వర్గంగా ఉన్న జూనియర్ నాయకుల హవా పెరిగింది. స్థానిక ఎన్నికల వేళ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి వచ్చేలా చేయాలని వారి అనుచరులు, అభిమానులు తేల్చి చెప్పేస్తున్నారు.
7
తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.8,500, గరిష్ఠ ధర రూ.12 వేలు, మోడల్ ధర రూ.10 వేల వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.6029 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 534.20 అడుగులకు చేరింది. ఇది 176.4614 టీఎంసీలకు సమానం.
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్
బాపట్ల టౌన్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో గణేష్ నిమజ్జనాలు ప్రారంభం కావడంతో జిల్లాలోని ఆయా ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాలోని క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాలోని సిబ్బందికి నిమజ్జన ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో వేడుకలను జరుపుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనాలు జరిగే ప్రదేశాల్లో అధిక సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. స్థానిక పోలీసు అధికారులు ఆయా ఉత్సవ కమిటీ సభ్యులతో రోజూ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యల గురించి సూచించాలన్నారు. గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఇసుక బకెట్లు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన విధానం తదితర ప్రతి విషయాన్ని పరిశీలించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి సమయంలో బీట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మండపాల కార్యనిర్వాహక సభ్యులు సహకరించాలని సూచించారు.
లక్ష్మీపురం: జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకర్‌ల సమావేశం ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరుగుతుందని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ హాజరు కానున్నారని తెలిపారు. అనంతరం డీఆర్‌సీ సమావేశం ఉంటుందన్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారిక పదవుల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు జిల్లాలో రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులు ఏది ఇవ్వాలన్నా గతంలో సీనియర్ల సిఫార్సుల మేరకే ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం జూనియర్ల హవా నడుస్తోంది. ఆ నాయకులు చెప్పిన వారికే పదవులు, అధికారులకు ఉన్నతస్థాయి పోస్టింగ్‌లు దక్కుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పదవులే కాకుండా జిల్లాలో ఇసుక, మట్టి, పేకాట క్లబ్బులు వంటి అక్రమ దందాలు సైతం జూనియర్ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్న పరిస్థితి. దీంతో సీనియర్లు చినబాబుకు ఎదురు తిరగలేక, పార్టీలో ప్రాధాన్యత కోల్పోయి తలెత్తుకు తిరగలేక అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా వారంలో రెండు రోజులు నియోజకవర్గాల్లో తిరుగుతూ, అనంతరం బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో వ్యాపారాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది సీనియర్లు అయితే వాళ్ల పరిధిలో ఉన్న మట్టి, గ్రానైట్, ఇతర మైనింగ్ వ్యవహారాల్లో నెలవారీగా ఫిక్స్‌డ్ ఆదాయం వచ్చేలా సెట్ చేసుకుని పార్టీకి దూరంగా తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు.
తీవ్ర అసంతృప్తిలో సీనియర్లు
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్లు పార్టీకి దూరంగా ఉండటంపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదే కొనసాగితే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం కూడా ఉందనే భయంతో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి గుంటూరు ఎంపీగా గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన లావు శ్రీకృష్ణదేవరాయలుకు లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా పదవి కట్టబెట్టడంపై కూడా సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
తొలి నుంచి పార్టీలో ఉన్నా...
జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్, రాజకీయాల్లో సీనియర్ అయిన కన్నా లక్ష్మీనారాయణ వంటి వారికి సరైన ప్రాధాన్యం లేకపోవడంపై వారి వర్గీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీనియర్లలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వకపోగా, జిల్లాలో వారు చెప్పిన వారికి నామినేటెడ్ పోస్టులు దక్కకపోవడం తీవ్ర అవమానకరంగా ఉందని అనుయాయుల వద్ద సీనియర్లు వాపోతున్నట్లు సమాచారం. జిల్లాలో ఇచ్చిన ప్రధాన పోస్టుల్లో జీడీసీసీ బ్యాంకు చైర్మన్, జీడీఎంఎస్ పోస్టులు ఎంపీలు చెప్పిన వారికి ఇవ్వడం, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా పేరొందిన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా జూనియర్ ఎమ్మెల్యే అనుచరుడికి ఇవ్వడంపై సీనియర్లు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీలో సీనియర్‌గా ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్‌ను పక్కనపెట్టి, మండల స్థాయి లీడర్‌కు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కేటాయించడంపై సీనియర్ ఎమ్మెల్యేలంతా గుర్రుగా ఉన్నారు. నాలుగైదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన తమపై పార్టీలో పెత్తనం చేసేందుకు మండల స్థాయి లీడర్‌ను పెట్టి అవమానిస్తారా అంటూ మండిపడుతున్నట్లు సమాచారం. సీనియర్ల నియోజకవర్గాల్లో సైతం వారికి తెలియకుండా రాష్ట్ర స్థాయి పదవులు చినబాబు వర్గానికి చెందిన వారికి ఇవ్వడంతో ఏమీ మాట్లాడలేక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
పార్టీలో, ప్రభుత్వంలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు, వారి వర్గంగా ఉన్న అనుయాయులంతా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి బుద్ధి చెబుదామంటూ ద్వితీయ శ్రేణి నాయకులంతా సీనియర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా, సీనియర్లలో పార్టీ పట్ల అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందనేది మాత్రం అక్షర సత్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తమ మాట వినకుండా జూనియర్ల పెత్తనం నడిస్తే మాత్రం వారిని ఓడించి పార్టీకి బుద్ధి చెప్పాలనే తలంపుతో ఉన్నట్లు సమాచారం.


