‘స్వచ్ఛతా హీ సేవ’కు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛతా హీ సేవ’కు ప్రాధాన్యం

Sep 17 2026 1:50 AM | Updated on Sep 17 2026 1:50 AM

‘స్వచ్ఛతా హీ సేవ’కు ప్రాధాన్యం కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు పెంచాలి పారదర్శకంగా సహకార ఉద్యోగుల బదిలీలు జిల్లాలో విస్తృతంగా పోలీస్‌ తనిఖీలు

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

లక్ష్మీపురం: జిల్లాలో పెద్ద ఎత్తున ‘స్వచ్ఛతా హీ సేవ 2026’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. కార్యక్రమంపై రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 17 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. పౌరులు, సంస్థలు, నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. పరిశుభ్రత లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లో మార్పు తీసుకురావడం, పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాలు, స్వచ్ఛ పాఠశాల–యువత భాగస్వామ్యం, సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్‌ శిబిరాలు వంటి అంశాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, గృహ కంపోస్టింగ్‌ను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 1వ తేదీన ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా ‘ఏక్‌ దిన్‌, ఏక్‌ ఘంటా, ఏక్‌ సాథ్‌’ పేరుతో సామూహిక శ్రమదానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె. మయూర్‌ అశోక్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు బొక్కా అగస్టీన్‌

లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల నమోదు చేసుకునేందుకు కాలపరిమితిని అక్టోబరు 25వ తేదీ వరకు పొడిగించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు బొక్కా అగస్టీన్‌ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం డీఆర్‌ఓ ఖాజావలికి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించినా తక్కువ గడువు పెట్టిందన్నారు. దీంతో అర్హులైన దివ్యాంగులు తహసీల్దార్‌ కార్యాలయాలు, నెట్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వర్లు పనిచేయకపోవడం, తహసీల్దార్‌ కార్యాలయాల్లో కులం, ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు సమయానికి వచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీటిని పరిశీలించి గడువును పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దివ్యాంగుల విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొరిటెపాడు (గుంటూరు): సహకార సొసైటీల్లోని ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌ మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. బ్రాడీపేటలోని బ్యాంకు పరిపాలనా భవనంలో బుధవారం డీఎల్‌ఈసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల అభ్యర్థనలను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులకు పదోన్నతులపై చర్చించారు. సీఈఓ వి.వి.ఎస్‌. ఫణికుమార్‌, గుంటూరు జిల్లా సహకార శాఖ అధికారి రత్నకుమారి, పల్నాడు జిల్లా సహకార శాఖ అధికారి నాగరాజు, ఆప్కాబ్‌ అధికారులు ఎం. శామ్యూల్‌ ధీరజ్‌, సీహెచ్‌. ధనాంజనేయులు పాల్గొన్నారు.

నగరంపాలెం: జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో బుధవారం విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించారు. పలు ప్రాంతాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పరిశీలించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, రద్దీ ప్రాంతాలు, ఆసుపత్రులు, బ్యాంక్‌లు, బస్టాండ్‌లు, విద్యాసంస్థలు, సున్నిత ప్రాంతాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌ కొనసాగించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించి, గణేష్‌ ఊరేగింపుల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పెట్రోలింగ్‌ నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల కదలికలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాల తనిఖీలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement