న్యూ ఢిల్లీలో ముగిసిన శిక్షణ | - | Sakshi
Sakshi News home page

న్యూ ఢిల్లీలో ముగిసిన శిక్షణ

Jul 9 2026 6:41 AM | Updated on Jul 9 2026 6:41 AM

భట్టిప్రోలు: సాంస్కృతిక వనరులు, శిక్షణ కేంద్రం (సీసీఆర్టీ) న్యూ ఢిల్లీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయుల కోసం జూన్‌ 29 నుంచి జులై 8 వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. బుధవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో జనరల్‌ ఆఫీసర్‌ అబిక్‌ సర్కార్‌ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా పత్రాలు అందచేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి హాజరైన 10 మందిలో వెల్లటూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు గుర్రం మురళీమోహన్‌ శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా పత్రం అందుకున్నారు. అనంతరం 11 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 85 మంది ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. శిక్షణలో పొందిననైపుణ్యాలను పాఠశాలల్లో సమర్థంగా వినియోగించాలని సూచించారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు మృతి

కొల్లూరు : మద్యం మత్తులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చింతర్లంకకు చెందిన అవివాహితుడైన ఆలూరి రాజేష్‌ (23) సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు. కొంతసేపు గడచిన అనంతరం తాను మందు తాగివచ్చినట్లు తల్లికి చెపితే రోజూ మాదిరిగానే మద్యం తాగి వచ్చి ఉండవచ్చునని భావించింది. అయితే మరి కొంతసేపటికి తాను పురుగు మందు తాగానని చెప్పడంతో హుటాహుటిన కొల్లూరు పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితిని పరిశీలించిన సిబ్బంది తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన నివేదిక అనంతరం వైద్యశాలలో ఏఎస్‌ఐ అర్జున్‌ శవ పంచనామా నిర్వహించారు. మృతుడి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కె. కిశోర్‌బాబు తెలిపారు.

అప్పుల బాధతో హోటల్‌ కార్మికుడు ఆత్మహత్య

చిలకలూరిపేటటౌన్‌: భార్య అనారోగ్యం, కొడు కు చదువు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఓ హోటల్‌ కార్మికుడు ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..చిలకలూరిపేట పట్టణంలోని రెడ్ల బజార్‌కు చెందిన షేక్‌ దరియా(51) స్థానిక కిచిడి హోటల్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్య ఆషాబేగం గత కొంతకాలంగా పక్షవాతం వ్యాధితో బాధపడుతోంది. భార్య వైద్య ఖర్చులకు, అలాగే కొడుకు మహబూబ్‌ సుభాని చదువు నిమిత్తం దరియా పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక, కుటుంబ భారం ఎక్కువై గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనస్తాపంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెంది, గత నెల 29న ఇంట్లో ఎలుకల నివారణ పేస్ట్‌ తిన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. భార్య ఆషాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

శతాధిక వృద్ధుడు ఆగమ పండితులు దీవి వీరరాఘవాచార్యులు మృతి

తెనాలి: ప్రముఖ వైఖానస ఆగమ పండితులు రూరల్‌ మండల గ్రామం కొలకలూరులో వేంచేసి ఉన్న శ్రీరాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వారి ఆలయ వంశపారంపర్య అర్చకులు పండిత దీవి వీరరాఘవాచార్యులు (106) మంగళవారం రాత్రి మృతి చెందారు. వృద్ధాప్యంతో ఉన్నప్పటికీ చివరి దశ వరకు ఆరోగ్యంగా ఉంటూ సునాయాస మరణాన్ని పొందారు. వైఖానస ఆగమ శాస్త్రంలో పాండిత్యాన్ని సము పార్జించి ఎందరో శిష్యులకు ఆగమ శాస్త్ర బోధన చేశారు. శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు రచించారు. భగవద్గీతలో పూర్తి సారాంశాన్ని 18 శ్లోకాలతో అందించి గీతా సారంగా హిందూ సమాజంలో విస్తృత ప్రచారం చేశారు. ఆధ్యాత్మికపరమైన కృషితోపాటు ఎందరో పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థల ద్వారా సన్మానా లు పొంది తనకు అబ్బిన విద్యను పదిమందికి పంచిపెట్టారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి సీతారామాచార్యులు ఆగమ శాస్త్రంలో పేరు ప్రఖ్యాతలు గడించారు. తల్లి చినరంగమ్మ కూడా 104 సంవత్సరాల వయసులో మృతి చెందారు. వీరరాఘవాచార్యులు మృతి పట్ల వైఖానస ఆగమ సంఘాలు, అర్చక సంఘా లు పలు ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం వ్యక్తంచేస్తూ, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement