ఎస్పీకి మాజీ కౌన్సిలర్ ఫిర్యాదు
బాపట్ల: ఏబీఎం ఆస్తులను అక్రమ రిజిస్ట్రేషన్‌తో సొంతం చేసుకుని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేసినందుకు ఆయన నుంచి ప్రాణ హాని ఉందంటూ మాజీ కౌన్సిలర్ వేమవరపు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారవేదికలో సోమవారం ఎస్పీ పిజిఆర్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరుల నుంచి కూడా తనకు ప్రమాదం పొంచి ఉందని సూచించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.
తెనాలి: తెనాలిలో అదివారం రాత్రి కురిసిన వర్షం, గాలులకు తెగిపడిన విద్యుత్ తీగె ఉదయాన్నే ఓ నిండు ప్రాణం తీసింది. పట్టణ నాజరుపేటలోని రూరల్ పోలీసు స్టేషనుకు సమీపంలో రోడ్డు పక్కన ఇంటిలో నివసించే షేక్ ప్యారీజాన్ (68) సోమవారం ఉదయం ఇంటిముందు ఊడుస్తోంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం, గాలులకు రోడ్డుపై పడిన చెత్త ఊడ్చే క్రమంలో, సమీప పోలీస్‌స్టేషను ప్రాంగణంలో చెట్టుకొమ్మలు విరిగిపడటాన్ని గమనించారు. ఉత్సుకతతో చేతిలో డస్ట్‌బిన్‌తో సహా అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ తెగిపడిన విద్యుత్ తీగె ఆమె కాలికి తగలటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెంది. ఇంటి బయట ఊడుస్తున్న ప్యారిజాన్ ఇంకా రాలేదేమని కుటుంబసభ్యులు ఆందోళనతో పరిసరాల్లో వెతుకుతుండగా విగతజీవురాలై కనిపించింది. ప్యారిజాన్ భర్త మాజీ సైనికుడు. ఇంతకుముందే మృతిచెందారు. కుమార్తెకు వివాహమైంది. గతేడాది ప్యారిజాన్ హజ్‌యాత్రకు కూడా వెళ్లివచ్చారు.
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టు పరిధిలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయికళ్యాణ్ చక్రవర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా సేవలు–ఏపీజీఎంఎస్‌ఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందిని వివిధ కోర్టులకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రూ.24.78 లక్షల విత్తనాలు స్వాధీనం
నగరంపాలెం: నగర పరిధిలోని విత్తన దుకాణంలో సోమవారం గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి డి.సూర్యశ్రావణ్‌కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు కొనసాగాయి. ఏటుకూరు రోడ్డులోని వాసవి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పరిశీలించగా, రికార్డులు సరిగాలేకపోవడం, విత్తనాల తయారీకి వాడే ప్రాసెసింగ్, ప్యాకింగ్ లైసెన్‌న్స్ పొందకపోవడాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ఐదు రకాల విత్తనాలైన సూపర్ బిబి–11 గోల్డ్, సూపర్ యమునా గోల్డ్ 1904, వరి, ప్రాసెస్ చేయబడిన/ రసాయన పూత పూసిన వరి(వదులుగా ఉన్నవి), ప్రాసెస్ చేయబడని/ శుద్ధి చేయని వరి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.24.78 లక్షల విలువ చేసే 26,791 కిలోల విత్తనాలు అని అధికారులు తెలిపారు.


