జనసేన మండలాధ్యక్షుడు చలమయ్య
కొల్లూరు: కులాలు.. మతాల మధ్య చిచ్చు రేపడం టీడీపీ వర్గాలలోని ఓ నాయకుడికి తగిన పని కాదని జనసేన మండల అధ్యక్షుడు బొందలపాటి చలమయ్య హితవు పలికారు. సోమవారం కొల్లూరు లాక్ సెంటర్‌లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, టీడీపీ నాయకుడు కనగాల మధుసూదన్ ప్రసాద్ తమ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాటలను వక్రీకరించి కుల, మతాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మధుసూదన్ ప్రసాద్ మీడియా సమావేశంలో తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు జనసేన నాయకులు, కులాలను గొడవలోకి లాగుతున్నారని విమర్శించారు. శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న దాడుల ఘటనలో తన ప్రమేయం లేదని చెబుతున్న మధుసూదన్‌ప్రసాద్ తన కాల్ డేటాను రేపల్లె డీఎస్పీకి అందజేసి నిష్పక్షపాతంగా విచారణకు సహకరించాలని సూచించారు. కాల్ డేటా ఆధారంగా కనగాల మధుసూదన్ ప్రసాద్ ప్రమేయం లేదని నిర్ధారణ అయితే తాము బహిరంగ క్షమాపణ చెప్పడానికై నా సిద్ధమన్నారు. టీడీపీకి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడితే తమ జిల్లా అధ్యక్షుడు గాదె చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కుల, మతాల రంగుపులమడం మానుకోవాలని సూచించారు. రెండేళ్ల క్రితం జరిగిన ఇదే తరహాలో జరిగిన గొడవలలో కొందరు రౌడీ మూకలు జనసేన, కాపు కులస్తులపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడిన ఘటనలో కొందరి వ్యక్తులపై కేసులు నమోదు చేయకపోవడం వలనే ఇప్పుడు ఈ దాడి జరిగిందన్నారు. టీడీపీ నాయకుల అనుచరుల ప్రమేయం ఈ దాడులలో లేని పక్షంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ ఇప్పటి వరకు ఎందుకు ఖండించలేకపోయారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆనందబాబు మహానాడు ఏర్పాట్ల సమావేశంలో జనసేన కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న కనగాల మధుసూదన్ ప్రసాద్‌ను పక్కన కూర్చోపెట్టుకోవడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. దాడికి గురైన ఉప్పు జానకిరామయ్యను ద్విచక్ర వాహనంపై పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లిన యువకుడికి దాడులకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా కేసు విచారణ చేసి అమాయకులపై కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు.


