పలు దుకాణాల్లో తూనికల్లో మోసాలు రాళ్ల కాటాలపై తగ్గుతున్న నిఘా పాలు, నూనెల కొలత పరికరాల్లోనూ అదే తంతు రేషన్ షాపుల్లోని కాటాలపైనా ఆరోపణలు ఎలక్ట్రానిక్, చిన్నకాటాలతో నష్టపోతున్న కొనుగోలుదారులు అడ్డ కాటాలతో నష్టపోతున్న అన్నదాతలు తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీలు నామమాత్రం
తూనికలు, కొలతల మోసాలతో సామాన్యుడికి నష్టం
చంద్రబాబు పాలనలో ఇప్పటికే అన్ని నిత్యావసరాలు, కూరగాయల ధరలూ మండుతున్నాయి. సగటు మనిషి కుటుంబ సభ్యులతో కలిసి మూడు పూటలా పట్టెడన్నం తినలేకపోతున్నాడు. సంపాదన కన్నా రోజురోజుకు చుక్కలు చూపిస్తున్న సరుకుల ధరలే అందుకు కారణం. ఈ క్రమంలో వెచ్చాల నుంచి పాలు, కూరగాయలు, పండ్లు, మాంసం.. ఇలా కొనుగోలు చేసే క్రమంలో విక్రయదారుల చేతివాటంతో ఇంకొంత కుంగిపోతున్నారు. పలు రేషన్ దుకాణాలకు సంబంధించిన కాటాల విషయంలో కూడా విమర్శలున్నాయి. చెల్లించిన మొత్తానికి సరిపడా సరుకులు రావడం లేదు. కాటాలో చేతివాటమే అందుకు కారణం. వీటిపై చర్యలు చేపట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ శీతకన్ను వేసింది. దీంతో సగటు జీవులు నష్టపోతున్నారు.
చీరాల అర్బన్: తూనికలు, కొలతలు.. ఇవి ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో అవసరం అవుతుంటాయి. అది బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి పాలు, నూనె వరకు ఏదైనా కావచ్చు. అందుకు సంబంధించి వినియోగదారులు నష్టపోకుండా నియంత్రించేందుకు ఉండేదే తూనికలు, కొలతల శాఖ. ఆ శాఖకు సంబంధించిన కార్యాలయాలు ఎక్కడ ఉంటాయో కూడా ప్రజల్లో ఎక్కువ మందికి తెలీదు. ఆ శాఖ విధుల నిర్వహణకు సంబంధించిన పరిధి ఎక్కువ. సంబంధిత అధికారుల పర్యవేక్షణ తక్కువనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించిన డిప్యూటీ కంట్రోలర్ నెల్లూరులో ఉంటారు. బాపట్ల జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ కంట్రోలర్ బాపట్లలో ఉంటారు. బాపట్ల, చీరాల డివిజన్‌లకు సంబంధించి ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఒకరు బాపట్లలో, ఒకరు చీరాలలో ఉంటారు. అయితే వీరికి పరిధి ఎక్కువ కావడంతో పర్యవేక్షణ తక్కువగా ఉంటోందన్న విమర్శలున్నాయి. అసిస్టెంట్ కంట్రోలర్ జిల్లా పర్యవేక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తారు. తూనికలు, కొలతల శాఖకు సంబంధించి అద్దంకి నియోజకవర్గం ఇప్పటికీ బాపట్ల జిల్లా పరిధిలోనే ఉంది. దీంతో పర్యవేక్షణ పరిధి 25 మండలాలుగా ఉంది. బాపట్ల ఇన్‌స్పెక్టర్ కార్యాలయం పరిధిలో 12 మండలాలు, చీరాల ఇన్‌స్పెక్టర్ కార్యాలయం పరిధిలో 13 మండలాలు ఉన్నాయి.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం
వారి పరిధిలో పెద్దపెద్ద కంపెనీల నుంచి తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల వరకు కాటాలు, కొలతల పరికరాలు ఎక్కడెక్కడ వినియోగిస్తారో నిఘా ఉంచాలి. నిబంధనల మేరకు చిన్న కాటాలకు, ఎలక్ట్రానిక్ కాటాలకు, మిల్లీ లీటర్ల కొలతలకు సంబంధించి ఏడాదికి ఒకసారి, అడ్డ కాటాలు (ఇనుప రాళ్లవి)కు సంబంధించి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆయా కాటాలపై శాఖాపరమైన ముద్రలు వేయాలి. అలా ముద్రలు వేయించుకోని వారిని గుర్తించి అధికారులు కేసులు నమోదు చేయాలి. అపరాధ రుసుం వసూలు చేయాలి. కొందరు విక్రయదారులు కాటాల్లో కనికట్టు చేస్తున్నారు. తూకాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా కాటాలకు నిబంధనల మేరకు ముద్రలు వేయించుకోకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ఇవేమీ అధికారులు పట్టించుకోవడం లేదు.
ముద్ర వేసినప్పుడు మామూళ్లు...
సంబంధిత వ్యక్తులు నిబంధనల మేరకు ముద్రలు వేసేందుకు ప్రభుత్వానికి రుసుం కాకుండా అదనంగా మామూళ్లు చెల్లించాల్సి వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారుల స్థాయిని బట్టి మొత్తాలు అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వారు తిరిగి కొనుగోలుదారుల వద్ద చేతివాటం చూపుతున్నారు. బార్లలో మద్యం విక్రయాల కొలతల పరికరాలలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా నిబ్ (క్వార్టర్), ఔన్స్(30 ఎంఎల్) కొనుగోలుదారులకు ఇచ్చే సమయంలో కౌంటర్‌లోని వ్యక్తులు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. తొలుత ఒకింత సక్రమంగా ఇచ్చినా.. ఆ తర్వాత ఆర్డర్ చేసిన వారు మద్యం మత్తులో పట్టించుకోరనే ఉద్దేశంతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో పలు బార్‌ల వద్ద వాదనలు, ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక, కొన్ని చోట్లయితే కొలతల పరికరాన్ని ఒకింత పైభాగం అరిగే విధంగా రుద్దుతారు. సంబంధిత అధికారులకు తెలిసే ఇది జరుగుతోందని, అందుకు తగిన ప్రతిఫలం వారికి ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


