అంకెతో వేగానికి లంకె | - | Sakshi
Sakshi News home page

అంకెతో వేగానికి లంకె

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

అంకెతో వేగానికి లంకె స్పీడ్‌ కాదు.. టైర్‌పై నెంబర్‌ చూడు గురూ.. ● ట్రాఫిక్‌ శాఖ విశ్లేషణ ప్రకారం, జిల్లాలో టైర్‌ లోపాల వల్ల జరిగిన ప్రమాదాల్లో సుమారు 40 శాతం ద్విచక్ర వాహనాలకు, 45 శాతం కార్లకు, మిగతా 15 శాతం ఆటోలు, లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. రాత్రిళ్లు హైవేల్లో అధిక వేగంతో ప్రయాణించే వాహనాల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ● వాహన తయారీ సంస్థ సూచించిన స్పీడ్‌ రేటింగ్‌ కంటే తక్కువ అక్షరాల టైర్లు వాడటం ప్రాణాంతకమని అధికారులు సూచిస్తున్నారు. టైర్‌పై అక్షరాలు, అంకెలు చెరిగిపోయిన స్థితిలో ఉంటే వెంటనే మార్చుకోవాలని, దీర్ఘ ప్రయాణాలకు ముందు టైర్‌ ప్రెజర్‌తో పాటు స్పీడ్‌ రేటింగ్‌, లోడ్‌ ఇండెక్స్‌ తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదాలకు కారణంగా మారుతున్న వాహన టైర్లు కంపెనీలు ఇచ్చిన పరిమితి కంటే అధిక వేగంతో వెళితే ప్రమాదమే టైర్లపైనే వాహన నియంత్రణ అంకెలు గమనించుకోవాలంటున్న నిపుణులు

స్పీడ్‌ కాదు.. టైర్‌పై నెంబర్‌ చూడు గురూ..

జిల్లాలో ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలు

సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు

2021 1047 431 913

2022 1071 397 1011

2023 972 352 912

2024 1042 442 1143

2025 898 355 781

పట్నంబజారు: గుంటూరు జిల్లా రహదారులపై వేగం ఒక అలవాటుగా మారింది. వేగం ప్రాణాంతకం.. వేగాన్ని మోయలేని టైర్లే మృత్యు సంకేతం. అయితే ఆ వేగాన్ని మోయగల సామర్థ్యం వాహనాలకు ఉందాం లేదా అన్న ప్రశ్నే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. జిల్లాలో ఏడాది కాలంలో నమోదైన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే, సుమారు ప్రతి నాలుగింట ఒక ప్రమాదం టైర్‌ లోపాల కారణంగానే జరుగుతున్నట్టు రవాణాశాఖ, పోలీసులు అధికారుల ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం – టైర్లపై ఉన్న వేగ సూచిక అక్షరాలపై వాహనదారుల అవగాహన లేకపోవటమే అందుకు కారణమని సుస్పష్టమవుతోంది. ప్రమాదాలు ముఖ్యంగా టైర్‌ బరస్ట్‌ అవ్వటం, స్కిడింగ్‌, గ్రిప్‌ కోల్పోవటం వంటివి జరగటం వలనే జరుగుతున్నాయి. అంటే వాహనం ఎంత వేగంతో వెళ్తుందో తెలిసినా, ఆ వేగాన్ని మోయగల టైర్లు వాడకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

అంకె తేల్చేస్తుంది

ప్రతి ద్విచక్ర వాహనం, కారు టైర్‌ పక్క భాగంపై కనిపించే నెంబర్లు ఉదాహరణకు 90/90–17 49పి, 165/70 ఆర్‌,14 81టి వంటి కోడ్‌లు సాధారణంగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఈ కోడ్‌లో చివర ఉన్న అక్షరమే ఆ వాహనం ఎంత వేగం వరకు సురక్షితంగా ప్రయాణించగలదో నిర్దేశిస్తుంది. ఉదాహరణకు ‘పి’ అక్షరం ఉన్న టైర్‌ గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగం వరకు మాత్రమే భద్రత కల్పిస్తుంది. గుంటూరు–విజయవాడ, గుంటూరు–నరసరావుపేట, గుంటూరు–చిలకలూరిపేట హైవేల్లో చాలా మంది ద్విచక్ర వాహనదారులు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా, వారి బైకుల్లో 100, 110 కిలోమీటర్ల వేగానికి మాత్రమే అనుకూలమైన జే, కే అక్షరాల టైర్లు ఉండటం ప్రమాదాలకు తావిచ్చినట్లు తెలుస్తోంది.

వివరం తెలిసేది ఇలా...

వాహనం టైర్‌ సైజ్‌ 120/80 ఆర్‌ 18 అని ఉంటే... అందులో 120 అనేది టైర్‌ వెడల్పు మిల్లిమీటర్లలో, 80 జరిగిన వెడల్పుతో కూడిన రేషియో, 18 అంటే టైర్‌కు సంబంధించి డైమీటర్‌ అంగుళాలలో ఉంటుంది. 18: టైర్‌ డైమీటర్‌ అంగుళాలలో ఉదాహరణకు ‘ఎం’ ‘వి’ అనే అక్షరాలు బండి టైర్లు ఎంత స్పీడు వెళ్ళవచ్చు అనే సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. ఏ1 ఉంటే 5 కిలోమీటర్లు, ఏ2కు 10, ఏ3 15, బి 50, సీ 60, డి 65, ఈ 70, ఎఫ్‌ 80, జీ 90, జే 100, కె 110, ఎల్‌ 120, ఎం 130, ఎన్‌ 140, పి 150, క్యూ 160, ఆర్‌ 170, ఎస్‌ 180, టీ 190, యూ 200, హెచ్‌ 210, వి 240, డబ్ల్యూ 270, వై 300, జెడ్‌ 240 ప్లస్‌ వరకు గరిష్ట వేగంతో వెళ్ళ వచ్చని సూచికలు చెబుతున్నాయి. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టైర్లపై అంకెలు, పేర్లును జాగ్రత్తగా గమనించటం ద్వారా ప్రమాదాలు తగ్గవచ్చని ఆర్టీఏ, పోలీసు శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement