నరసరావుపేట టౌన్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సదస్సు నిర్వహించారు. సమాధాన్ సమరోహ 2026లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జియావుద్దీన్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నవారు ఆగస్టు 21, 22, 23 తేదీలలో జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని కోరారు. దీనికోసం ఈ నెల 31వ తేదీలోపు నిర్దేశిత గూగుల్ ఫారం పూరించి తమ అంగీకారం తెలియజేయాలన్నారు. ప్రజల అవగాహన కోసం ముద్రించిన ప్రత్యేక కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఏపీపీ కట్ట కాళిదాస్, మొదటి పట్టణ సీఐ షేక్ టి.ఫిరోజ్, ట్రాఫిక్ సీఐ లోకనాథం, ఎస్‌ఐ వంశీకృష్ణ, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పలువురు ప్రజలు పాల్గొన్నారు.
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షలో పల్నాడు జిల్లా 87.30 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఐసెట్ ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 511 మంది నమోదు కాగా పరీక్షకు 449 మంది హాజరయ్యారు. వీరిలో 392 మంది అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 201 మంది పురుషులు, 191 మంది మహిళలు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు అర్హులు.
పథకాలను మాజీ సైనికులు
సద్వినియోగం చేసుకోండి
మాచర్ల రూరల్: మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగపర్చుకోవాలని సైనిక సంక్షేమ ఉమ్మడి జిల్లా శాఖాధికారి ఆర్.గుణశీల కోరారు. శనివారం పెన్షనర్స్ అసోసియేషన్ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుందని సాగు భూమితో పాటు పిల్లల చదువులలో రిజర్వేషన్, క్యాంటీన్‌లో సబ్సిడీపై అందించే వివిధ వస్తువులను సకాలంలో తీసుకోవాలని కోరారు. విద్యకు స్కాలర్‌షిప్, కుమార్తె వివాహానికి నగదు, వైకల్య గ్రాంటు, ఈసీహెచ్‌ఎస్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందుకోవాలన్నారు. మృతిచెందిన మాజీ సైనికుల భార్యలకు గుర్తింపు కార్డులను అందించారు. ఇటీవల అంగవైకల్యం పొందిన ఇన్నారెడ్డి గృహానికి వెళ్ళి పరామర్శించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కేపీ సిద్ధంరాజు, ప్రధానకార్యదర్శి తాటి వినోద్‌బాబు, కోశాధికారి ఆర్ గోపాల్ నాయక్, ఉపాధ్యక్షులు వి.మరియదాసు, సభ్యులు కారంకి శ్రీనివాసరావు, రామారావు, పి.బాబు, ఇన్నారెడ్డి, శేఖర్, రవి పాల్గొన్నారు.
పొన్నూరు: మామిళ్లపల్లి రైతులపై టీడీపీ నాయకులు దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదివారం రానున్నారని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మామిళ్లపల్లి అడ్డరోడ్డు నుంచి మామిళ్లపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.
లక్ష్మీపురం: ఓ ఇంట్లో 25 సవర్ల బంగారం, రూ.2.50 లక్షల నగదు చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. ముత్యాలరెడ్డినగర్ 8వ లైన్ ప్రాంతానికి చెందిన దుగ్గెంపూడి ప్రభాకర్‌రెడ్డి కన్‌స్ట్రక్షన్ పని చేస్తుంటారు. భార్య భూలక్ష్మి ఇంటి వద్దనే ఉంటుంది. ఇంట్లో బీరువాలో ఉన్న 25 సవర్ల బంగారం, అలాగే బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు కనిపించలేదు. దీన్ని గమనించిన ప్రభాకర్‌రెడ్డి ఆయన సతీమణి భూలక్ష్మి, ఇంట్లో పని చేసే మహిళపై అనుమానం వ్యక్తం చేశారు. బాధితులు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


