పారిశ్రామికంగా బాపట్ల జిల్లా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామికంగా బాపట్ల జిల్లా అభివృద్ధి

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: పారిశ్రామికంగా బాపట్ల జిల్లా అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి విధానంలో ప్రభుత్వం విరివిగా రాయితీలు కల్పిస్తుందని చెప్పారు. స్థిర పెట్టుబడి రాయితీ, విద్యుత్‌ రాయితీ, పావలా వడ్డీ రాయితీల్లో భాగంగా 49 పరిశ్రమలకు రూ.8.30 కోట్లు రాయితీ మంజూరు చేశారు. బాపట్ల జిల్లాలో టీ షర్డ్స్‌, క్యాప్‌, జనపనారతో వివిధ రకాల ఉత్పత్తుల యూనిట్‌ స్థాపనకు కృషి చేయాలన్నారు.

బీచ్‌లలో ప్లాస్టిక్‌ వాడకం నిషేధం

బాపట్ల జిల్లాలోని బీచ్‌లలో జూన్‌ నెల ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ప్రత్యామ్నాయంగా జనపనార బ్యాగులు, సంచులు వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం జనపనార సంచులు, బ్యాగులు ఉత్పత్తి చేయాలని, వాటిపై ‘బే ఆఫ్‌ బాపట్ల‘ లోగో ముద్రించాలన్నారు. అలాంటి యూనిట్లను స్థాపించే వారికి యుద్ధ ప్రాతిపదికన రుణం మంజూరు చేయాలన్నారు.

మార్టూరులో మాడ్యూల్‌ ప్యానెల్‌ ఉత్పత్తి

జైట్‌ ఎనర్జీ సోలార్‌ పీవీ మాడ్యూల్‌ ప్యానెల్‌ ఉత్పత్తి కేంద్రం మార్టూరులో ఏర్పాటు కానుందని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ చెప్పారు. రూ.198.4 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. ఆ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన రుణ సదుపాయం కల్పించాలని, పర్యావరణ అనుమతులు పరిశీలించాలని సూచించారు. బాపట్ల మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం భూమి గుర్తించాలని, ప్రభుత్వ భూమి లేకపోతే భూసేకరణతో కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ వై రామకృష్ణ, ఎల్‌డీఎం శివకృష్ణ, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నరసింహారావు, ఏపీ ఎస్‌ఎఫ్‌సీ సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ రామాంజనేయులు, ఆర్డీవో గ్లోరియా, ఫ్యాప్సియా రాష్ట్ర సీనియర్‌ సభ్యులు భక్తవత్సలం, కమిటీ సభ్యులైన వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ ద్వారా రూ.100కోట్లు

జీఎస్టీ పన్నుల ద్వారా బాపట్ల జిల్లాకు రూ.100 కోట్లు ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ చెప్పారు. జీఎస్టీ పన్నుల వసూలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల వసూలులో బాపట్ల జిల్లా మంచి పురోగతి సాధించినట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో 10శాతం పన్నులు వసూలు పెరిగిందన్నారు. ప్రొఫెషనల్‌ టాక్స్‌ కింద జిల్లాలో రూ.39.32 కోట్లు పన్ను వసూలు అయిందన్నారు. పర్యాటకరంగంగా బాపట్ల జిల్లా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్‌ చెప్పారు. చిన్నగంజాం బీచ్‌ను శనివారం ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో జీఎస్టీ అధికారి మురళీకృష్ణ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ వై రామకృష్ణ, కమిటీలోని అనుబంధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement