విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి

బాపట్ల: విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రపంచ స్థాయి పోటీలకు సిద్ధం కావాలి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల 81వ వార్షికోత్సవ సభ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ విద్యకు బాపట్ల వ్యవసాయ కళాశాల ఒక చారిత్రాత్మక కేంద్రంగా నిలిచిందని చెప్పారు. ఎనిమిది దశాబ్దాలుగా అనేక మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులను ఈ కళాశాల అందించిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, నూతన పద్ధతులను రైతులకు చేరవేయడంలో కళాశాల కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, బ్యాంకింగ్‌, అగ్రి బిజినెస్‌ సంస్థలు, ఆహార పరిశ్రమలు, వ్యవసాయ సాంకేతిక సంస్థల్లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రైతులకు వ్యవసాయ విద్య ఎంతో తోడ్పడుతోందని పేర్కొంటూ, శాసీ్త్రయ పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచడం, ఖర్చులు తగ్గించడం, నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం సాధ్యమవుతోందన్నారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గ్రామాలకు వెళ్లి రైతులకు ప్రత్యక్షంగా సూచనలు అందిస్తూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగి రైతు సంక్షేమానికి తమ వంతు సేవ చేయాలని ఉపకులపతి పిలుపునిచ్చారు. అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.ప్రసూనా రాణి కళాశాల గత ఏడాది విద్య రంగంలో సాధించిన విజయాలతోపాటు క్రీడలు, మరియు సాంస్కృతిక పోటీలలో సాధించిన ఓవర్‌ ఆల్‌ చాంపియన్‌ షిప్‌ వివరాలతో కూడిన వార్షిక నివేదికను సమర్పించారు. సభకు డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ సి.హెచ్‌. శ్రీనివాస రావు అధ్యక్షత వహించగా, విశిష్ట అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ఆహార ప్రాసెసింగ్‌ సొసైటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ జి.శేఖర్‌ బాబు(ఏ.ఎఫ్‌.ఎస్‌.) ఆధునిక వ్యవసాయ చరిత్రలో బాపట్ల వ్యవసాయ కళాశాల చేస్తున్న సేవలను కొనియాడారు. అతిథిగా పాల్గొన్న ఐ.సి.ఏ.ఆర్‌. డైరెక్టర్‌, అటారీ సౌత్‌ జోన్‌ డాక్టర్‌ షేక్‌ ఎన్‌.మీరా మాట్లాడుతూ విద్యార్థులే వ్యవసాయ రంగ భవిష్య నిర్దేశకులని పేర్కొన్నారు. ఆఫీసర్‌ ఇన్‌చార్జి స్టూడెంట్‌ ఆక్టివిటీస్‌ డాక్టర్‌ ఎం.శ్రీరేఖ వందన సమర్పణ చేశారు.

వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ

Advertisement
 
Advertisement
Advertisement