ప్రకాశం, బాపట్ల జిల్లాల నాబార్డ్ డీడీ రవికుమార్
ఇంకొల్లు (చినగంజాం): రైతులంతా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకుని సాగు ఖర్చులు తగ్గించాలని ప్రకాశం, బాపట్ల జిల్లాల నాబార్డ్ డీడీ రవికుమార్ సూచించారు. ఇంకొల్లు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, బాపట్ల సెర్ఫ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎఫ్‌పీసీ సెంటర్‌కు సంబంధించిన సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం ఇంకొల్లు పంచాయతీ పరిధిలోని హనుమోజీపాలెం గ్రామంలో సాయి సేవా సమితి భవనంలో నిర్వహించారు. రైతులతో నిర్వహించిన ఈ సమావేశంలో డీడీ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతు ఉత్పత్తి కేంద్రాలకు భవిష్యత్‌లో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నాబార్డు ఆర్థిక సహాయ సహకారాలతో ఎఫ్‌పీసీ సెంటర్లను అందులోని సభ్యులంతా కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్‌పీసీ సెంటర్లపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రధానంగా రైతులు పండించిన పంట ఉత్పత్తులను ఉమ్మడిగా ఎఫ్‌పీసీ ద్వారా అమ్ముకుని లబ్ధిపొందాలని సూచించారు. రైతులు పంటలు సాగుచేసేటప్పుడు బహుళ జాతి పంటలు ఒకే పొలంలో సాగు చేయటం వలన ఫలితం ఉంటుందని తెలిపారు. అనవసరంగా రసాయన క్రిమి సంహారక ఎరువుల వాడకం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేచురల్ ఫార్మేషన్ ద్వారా వ్యవసాయం చేసి ఖర్చులు తగ్గించుకుని నాణ్యమైన ఉత్పత్తులు పండించాలని తెలిపారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సందేహాలకు సమాధానాలు తెలిపారు. కార్యక్రమంలో సెర్ఫ్ సంస్థ కో ఆర్డినేటర్ శివ, ఇంకొల్లు ఎఫ్‌ఏసీ సెంటర్ ఎండీ ఎం.శ్రీనివాసబాబు. బీఓడీ సభ్యులు దేవబత్తిన దుర్గా ప్రసాద్, పాలేటి సుబ్బారావు, గుడివాడ ప్రసాద్, ఆరే మురళి, బత్తిన రాములు, ఆరే కోటేశ్వరరావు, ఆరే శరత్, ఆర్.వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


