ప్రతి నీటి బొట్టును సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి నీటి బొట్టును సంరక్షించాలి

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

యద్దనపూడి: ప్రతి నీటి బొట్టును సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని మున్నంగివారిపాలెం గ్రామంలో జలధార–జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో పర్యటించి రక్షిత మంచినీటి పథకాలు, ఇంకుడుగుంతలు, కంపోస్ట్‌ పిట్స్‌ను పరిశీలించారు. అనంతరం చెరువుకట్టపై కొబ్బరిమొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో చెరువుల పూడికతీత పనులు ఒక యజ్ఞంలా చేపట్టాలన్నారు. మనందరం పెట్రోలు, డీజిల్‌ ఆదా చేసినట్లుగానే నీటిని కూడా ఆదా చేయాలన్నారు. అందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాగునీటి కాలువలు, చెక్‌డ్యాంలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా గ్రౌండ్‌ వాటర్‌ లెవల్స్‌ మరింత పెంచుకోవచ్చన్నారు. నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో సమర్థవంతంగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నీటి వనరును సంరక్షించడం, వర్షం నీటి నిల్వలను పెంపొందించటంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టలపై మొక్కలు నాటి గ్రామాలను పచ్చతోరణాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎల్‌.ప్రభాకర్‌రావు, జలవనరుల శాఖ ఎస్‌ఈ గోపీనాథ్‌, డ్వామా పీడీ విజయలక్ష్మి, తహసీల్దారు రవికుమార్‌, ఎంపీడీఓ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement