రెండు వర్గాలుగా టీడీపీ
వేమూరు: చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సహజవనరుల దోపిడీకి తమ్ముళ్లు తెగబడుతున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సంపాదనే ముఖ్యం
అమృతలూరు మండలంలోని మోపర్రు గ్రామంలోని చెరువులో మట్టిని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులోని మట్టి తవ్వకాలు చేపట్టారు. మట్టిని ట్రాక్టర్ల ద్వారా ఇతర గ్రామాల వారికి అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు, మైనింగ్ అధికారులు మట్టి తవ్వకాల గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. మట్టి తవ్వకాలు నిలిపి వేసేందుకు ఒక మహిళ యంత్రాలు, ట్రాక్టర్లకు అడ్డుపడినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. చెరువులో మట్టిని తెలుగు దేశం నాయకులు సంపాదన కోసం ఇలా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు వెంటనే అక్రమ మట్టి తవ్వకాలను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకునేందుకు ఒక మహిళ ట్రాక్టర్లను, జేసీబీలను అడ్డుకుంది. దీంతో చుండూరు పోలీసులు హడావుడిగా చెరువులో తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లారు. తెలుగు దేశం పార్టీలోని రెండు వర్గాలతో మాట్లాడారు. గొడవలు లేకుండా మట్టి తవ్వకాలు చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. బాపట్ల జిల్లా కేంద్రం నుంచి మైనింగ్ అధికారులు కూడా వచ్చి పరిశీలించారు. పెదగాదెలవర్రు గ్రామంలోని తెలుగు దేశం పార్టీలోని కంఠమనేని రాహుల్, మాజీ సర్పంచ్ కుమారుడు వేణుమాధవ్ రెండు వర్గాలు చీలారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వేణుమాధవ్‌కు మద్దతుగా ఉన్నారు. రాహుల్ వర్గం మట్టి తవ్వకాలు నిలిపివేయాలని తహసీల్దారు కార్యాలయంలో, చుండూరు సర్కిల్ సీఐకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ మట్టి తవ్వకాలు నిలిపి వేయలేదు. రాహుల్ వర్గం చెరువు వద్దకు వచ్చి గొడవ చేయడంతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నిలిపివేశారు.
చెరువుల్లో మట్టి తవ్వకాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడింది. మోపర్రు గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులను పక్కన పెట్టి జూనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్థానికులు చెప్పుకొంటున్నారు. చెరువు మట్టి తవ్వకాలు కూడా యువకులు చేస్తుండటంతో సీనియర్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం రెండు వర్గాలకు చెందిన వ్యక్తులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పిలిపించి చర్చలు కూడా జరిపించారు. సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఎంపీడీఓ మారుతి శేషాంబను చెరువు వద్దకు పంపించారు. మట్టి తవ్వకాలను ఆమె పరిశీలించారు.
గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం మట్టి తవ్వకాలు చేస్తున్నారు. మట్టిని గ్రామంలో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు. మట్టి బయటి వారికి అమ్ముకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– నెహ్రూబాబు,
తహసీల్దారు, చుండూరు మండలం.


