మంగళగిరి టౌన్: విద్యార్థులు ఉన్నత స్థానం నుంచి అద్భుత విజయాలవైపు ప్రయాణం సాగించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణ పరిధిలోని సీకే కన్వెన్షన్‌లో గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌లతో కలసి పెమ్మసాని కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో అత్యధికంగా బాపట్లలోని కొల్లూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి దివ్యతేజశ్రీ 596 మార్కులు సాధించడం గర్వకారణమని మంత్రి తెలిపారు. 65 మంది విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం, లెదర్ బ్యాగ్, పెన్నులతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా జిల్లాలో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లిడ్‌క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు, ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థల ఈడీ తిలక్‌బాబు, ఆర్‌జేడీ నాగమణి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల విద్యాశాఖ అధికారులు సలీంబాషా, శ్రీనివాసరావు, రామారావు, చంద్రకళ, ఏలూరు, గుంటూరు, తెనాలి డీవైఈవో సుధాకర్ రావు, ఏసురత్నం, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని


