● ఆగని తవ్వకాలు
● ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు
కొల్లూరు: అధికారుల ఆదేశాలను ఇసుకాసురులు బేఖాతరు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం పరిధిలోని కృష్ణా నదిలో ఇసుక క్వారీ దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన నిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ టీడీపీ నేతల అండదండలతో బాపట్ల జిల్లాలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతోంది. అక్రమ తవ్వకాలపై బుధవారం ‘సాక్షి’లో ‘అక్రమాలకు హద్దే లేదు’ అనే శీర్షికన కథనం వెలువడింది. దీంతో స్పందించిన అధికారులు బాపట్ల జిల్లా పరిధిలో ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. ఇసుక తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన రెవెన్యూ, పోలీసు, మైనింగ్, సర్వే శాఖల అధికారులు బాపట్ల జిల్లా పరిధిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు నిర్ధారించి తవ్వకాలు నిలిపివేయించారు. ఉమ్మడి సర్వే నిర్వహించి ఇరు జిల్లాల నడుమ హద్దులు నిర్ణయించిన అనంతరం తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో అక్కడ నుంచి లారీలను, పొక్లెయిన్‌లను వెనక్కి పంపారు. జిల్లా యంత్రాంగ ఆదేశాలను పెడచెవిన పెట్టిన నిర్వాహకులు గురువారం తిరిగి బాపట్ల జిల్లా పరిధిలో ఇసుక తవ్వకాలు ఆరంభించారు. జిల్లా పరిధిలో ఐదు పొక్లెయిన్‌లు మోహరించి ఇసుక తవ్వకాలు చేపట్టడాన్ని పసిగట్టిన పోతార్లంక, తదితర లంక ప్రాంత రైతులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆ ప్రాంతానికి వెళుతుండటాన్ని ముందుగానే పసిగట్టిన ఇసుకాసురులు హుటాహుటిన అక్కడ నుంచి యంత్రాలను కృష్ణా జిల్లా హద్దులలోకి తరలించారు. అధికార యంత్రాంగం తక్షణం స్పందించకుంటే ఆందోళనకు దిగేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.


