హానికర రసాయనాలు వినియోగిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

హానికర రసాయనాలు వినియోగిస్తే చర్యలు

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు

చీరాల: పలు రకాల పండ్లు త్వరగా పండడానికి హానికర రసాయనాలు వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి ప్రణీత్‌ అన్నారు. గురువారం చీరాల కూరగాయల మార్కెట్‌ సమీపంలోని హోల్‌సేల్‌, రిటైల్‌ పండ్ల దుకాణాలపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అరటి, దానిమ్మ, మామిడి, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. ప్రస్తుతం వేసవిలో మామిడి పండ్లకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. పక్వానికి రాకముందే త్వరగా పండేందుకు కార్బైడ్‌ వంటి రసాయనాన్ని వినియోగించడం వలన అవి త్వరగా పండిపోతాయన్నారు. అటువంటి పండ్లు చూడడానికి మంచి రంగుతో కనిపించి ఆకర్షిస్తాయన్నారు. పండ్ల వ్యాపారులు ఇదే అదనుగా హానికర రసాయనాలను వాడుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కార్బైడ్‌ వంటి రసాయనాలను వాడుతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిస్తామని, నివేదిక వచ్చిన అనంతరం నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement