ప్రత్తిపాడు: హైవేపై ముందు వెళుతున్న కార్డును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గురువారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చిలకలూరిపేట డిపో నుంచి గుంటూరు డిపోకు ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్న ఆర్టీసీ బస్సు, ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం కాటూరి ఆస్పత్రి సమీపంలో పదహారవ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వెళుతున్న ఇన్నోవా కారును వెనుక నుం,ఇ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణీకులు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. హైవేపై ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బందితో పాటు ప్రత్తిపాడు ఎస్‌ఐ నరహరి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అదే సమయంలో బస్సులో కూడా ప్రయాణీకులు ఉండటం, ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.


