టీడీపీ నేతల మధ్య వాటాల వివాదం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల మధ్య వాటాల వివాదం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

● నేటికీ ప్రారంభం కాని ఇసుక తవ్వకాలు ● అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న ఓ వర్గం

కొల్లూరు: కొల్లూరు మండలం చిలుమూరు వద్ద కృష్ణానదిలో 4.870 హెక్టార్ల విస్తీర్ణంలో 73,050 మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలకు ఏప్రిల్‌ 24న జిల్లా అధికారుల నుంచి అనుమతులు మంజూరయ్యాయి. ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన శ్రీనివాస ఇన్‌ఫ్రా అండ్‌ లాజిస్టిక్స్‌ కంపెనీ నేటి వరకు క్వారీని ఆరంభించలేదు. తవ్వకాలు ప్రారంభం కాకపోవడం వెనుక వాటాల వివాదమే కారణమన్న విషయం టీడీపీ శ్రేణులతోపాటు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేత అనుచరులు ఇసుక తవ్వకాల కోసం నదిలో గాలు మార్గం ఏర్పాటు చేసిన ప్రయత్నాలను నియోజకవర్గ స్థాయి నేత అనుచరులు అడ్డుకున్నారు. దీంతో పనులు నిలిపివేచినట్లు చర్చ నడుస్తుంది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేత ఇసుక క్వారీ నిర్వహణ అంశంపై మండల స్థాయి పలువురు నాయకులను సంప్రదించినప్పటికీ వేమూరు నియోజకవర్గ స్థాయి నేత కన్నెరజేస్తారన్న సంశయంతో వెనుకంజ వేస్తున్నట్లు వినికిడి. చివరకు ఇసుక క్వారీ నిర్వహణ పంచాయతీలో 60 శాతం వాటా తనకు కేటాయించాలని వేమూరు నియోజకవర్గ స్థాయి నేత డిమాండ్‌ చేసినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వచ్చిన ఆధాయంలో 60 శాతం ఆయనకిస్తే తమకు మిగిలేదేంటంటూ.. ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం వద్దే తేల్చుకునేందుకు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేత సమాయత్తమవుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులలో చర్చలు నడుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement