తప్పిపోయిన మహిళ బంధువులకు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన మహిళ బంధువులకు అప్పగింత

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

పర్చూరు(చినగంజాం): మతిస్థిమితం లేక తప్పిపోయిన మహిళను గుర్తించి పర్చూరు పోలీసులు వారి బంధువులకు అప్పగించారు. పర్చూరు ఎస్సై పులి గోపి వివరాల మేరకు.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలేనికి చెందిన తిరుమల జంపారావు కుటుంబం ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో ఇటీవల నిర్వహించిన పొలిమేర వీరాంజనేయస్వామి తిరునాళ్లకు వచ్చారు. జంపారావు కుమార్తె కూడా వచ్చింది. ఈమెకు మతిస్థిమితం లేదు. తిరునాళ్ల ముగిసిన అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో పూసపాడు అడ్డరోడ్డు వద్ద కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో అక్కడి నుంచి ఆ మహిళ ఒక్కతే నడుచుకుంటూ వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం పర్చూరు మండలంలోని జాగర్లమూడి గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహిళను గమనించిన పోలీసులు ఎస్‌ఐ గోపి ఆధ్వర్యంలో ఆమెను అదుపులోనికి తీసుకొని విచారించారు. మహిళ మాటతీరు, పరిస్థితిని గమనించిన పోలీసులు ఆమె మతి స్థిమితం సరిగా లేదని గుర్తించారు. అనంతరం ఆమె వివరాలను సేకరించి చివరగా జంపారావు కుమార్తెగా గుర్తించారు. వెంటనే ఎస్‌ఐ క్రోసూరు ఎస్‌ఐ సహకారంతో ఆవులవారిపాలెం సర్పంచ్‌ సహకారంతో మహిళ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మహిళ బంధువులను పర్చూరు పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన మహిళ విషయంలో ఎస్‌ఐ ప్రదర్శించిన చొరవను పలువురు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement